
మా భూములు బీపీసీఎల్‌కు ఇవ్వం
● ఆర్డీఓకు రైతులు స్పష్టం
కావలి: ‘మా భూములను ఎట్టి పరిస్థితుల్లో బీపీసీఎల్ కంపెనీకి ఇవ్వబోమని కావలి మండలం ఆనెమడుగు పంచాయతీకి చెందిన రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు తదితరులు సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయ ఏఓకు స్పష్టం చేశారు. సీపీఎం నేత తాళ్లూరు మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నేత పేముల సీతారామయ్య, ఆనెమడుగు పంచాయతీకి చెందిన మందా చిన్నయ్య, ఆర్.జయరామిరెడ్డి, కె.రవీంద్ర సోమవారం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్థానిక రైతుల అభిప్రాయంగా తెలియజేశారు. ఆనెమడుగులోని మా భూములను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌తో కలిసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కంపెనీకి అప్పగించే ప్రయత్నం చేస్తుందని, భూములు తీసుకుంటే మా బతుకుదెరువు బుగ్గిపాలవుతుందని పేర్కొన్నారు. మేము మా భూము లను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని మీ ద్వారా కలెక్టర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నట్లు ఆ లేఖలో వివరించారు. ఒక వేళ మా పొలాలు బలవంతంగా తీసుకోవాలనుకుంటే తాము ప్రాణాలు అర్పించే దానికై నా సిద్ధమేనని, ఇప్పటికే మా నిర్ణయాన్ని కలెక్టర్‌కు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, ఆర్డీఓకు అర్జీలిచ్చి ఉన్నామన్నారు.