
సంపూర్ణ అక్షరాస్యతకు సమష్టిగా కృషి
● కలెక్టర్ ఓ ఆనంద్
కోవూరు: జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ఒక నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ప్రణాళిక చేపట్టామని, అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చొరవతో ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని తెలిపారు. మంగళవారం కోవూరు ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 22,000 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎంపిక చేసిన వారికి నేరుగా పనుల్లో మస్టర్ వేసే విధానం, బ్యాంకింగ్ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యక్రమాల విధివిధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. 90 రోజుల ప్రణాళికలో భాగంగా అక్షరాలు నేర్పించడమే కాకుండా ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతలో మెళకువలు నేర్పిస్తామన్నారు. ఇందుకోసం 2,500 మంది స్వచ్ఛంద ఉపాధ్యాయులను నియమించామన్నారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. నిరక్షరాస్యులకు వారి రోజువారి పనులకు ఆటంకం కలగకుండా వారికి అనువైన సమయంలోనే అక్షరాలు నేర్పిస్తామన్నారు. ఇందుకోసం గుర్తించిన కమ్యూనిటీ మొబిలైజర్లు తమ వంతు కృషి చేసి ప్రతి ఒక్కరు ప్రతి రోజు హాజరయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు.
విజయవంతం చేయండి
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం చైతన్య వంతమైందని, గతంలో చేపట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు విజయవంతంగా జరిగాయన్నారు. తాజాగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఇందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య డీడీ మహమ్మద్ ఆజాద్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, డీఈఓ బాలాజీ రావు, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, కోవూరు సర్పంచ్ విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.