
సహకార రంగంలో కొనసాగించాలి
కోవూరు: కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో కొనసాగించాలని పలువురు నాయకులు కోరారు. గురువారం కోవూరు చక్కెర కర్మాగారం గేట్ ముందు అఖిల భారత చెరకు రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి రవీంద్రన్ మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సహకార రంగంలోని చెరకు ఫ్యాక్టరీలను కేంద్రమిచ్చే ఆర్థిక సహకారంతో నడుపుతున్నారని, కానీ ఇక్కడ ప్రభుత్వం సహకార రంగంలోని ఫ్యాక్టరీలను అమ్మేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. చెరకుకు మద్దతు ధర ఇవ్వాలని అడుగుతుంటే కేంద్రం అంగీకరించడం లేదన్నారు. తమిళనాడు రైతు సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైతులు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో నేతలు గండవరపు శ్రీనివాసులు, అప్పారావు, సూర్యనారాయణ, రఘురామయ్య, వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు.