
రేషన్ ఇవ్వలేదని మహిళల నిరసన
కొండాపురం: ఈనెలకు సంబంధించిన రేషన్‌ను ఇంతవరకు ఇవ్వలేదని మండలంలోని వెలిగండ్ల, చింతలదేవి పంచాయతీల్లోని బసిరెడ్డిపల్లి, బగాదిపల్లి గ్రామాలకు చెందిన కొందరు మహిళలు వాపోయారు. బసిరెడ్డిపల్లిలో వారు శుక్రవారం నిరసన తెలిపి మాట్లాడారు. షాపు నంబర్‌లో 20 నుంచి ప్రతి నెలా తమకు వెహికల్ ద్వారా రేషన్ బియ్యం అందించేవారన్నారు. ఏప్రిల్ నెలాఖరు వస్తున్నా 84 మంది కార్డుదారులకు రేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్‌ను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. తమకు బియ్యం ఇవ్వడం ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులను అడిగితే సరైన సమాధానం రావడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి బియ్యం అందించాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని రేషన్ షాపులకు సంబంధించి ఈ నెలలో బియ్యం తక్కువగా వచ్చిందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నెలాఖరులోగా ప్రతి లబ్ధిదారుకు బియ్యం అందిస్తామని తెలిపారు.