
సమగ్రశిక్ష.. పట్టించుకునే దిక్కేది!
విద్యాశాఖలో ఎంతో కీలకమైన సమగ్రశిక్షలో పాలన అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది కొరత ఆ శాఖను పట్టిపీడిస్తోంది. నాడు – నేడు నుంచి రకరకాల శిక్షణల వరకు దాని ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. ఇంకా భవిత, ప్రత్యామ్నాయ స్కూల్స్, కేజీబీవీలు తదితరాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. అయితే ఆ శాఖలో ప్రధాన విభాగాల్లోని పోస్టులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
తీవ్రంగా వేధిస్తున్న
సిబ్బంది కొరత
● రెగ్యులర్ ఈఈ,
నలుగురు డీఈల పోస్టులు ఖాళీ
● ఐఈ కో–ఆర్డినేటర్, ఏఎల్‌ఎస్,
ఏఎంఓ, ఏఎస్‌ఓలు కూడా..
● ఆ శాఖ పర్యవేక్షణలోనే
నాడు – నేడు పనులు
● ఇంకా పట్టు సాధించని ఏపీసీ
నెల్లూరు(టౌన్): కూటమి ప్రభుత్వం విద్యాశాఖను గాలికొదిలేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మనబడి నాడు – నేడు పనులు చాలావరకూ శరవేగంగా జరిగాయి. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో అవి అసంపూర్తిగానే ఉన్నాయి. నాడు – నేడుకు సంబంధించి ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. పైగా సమగ్రశిక్షలో ఖాళీ పోస్టుల భర్తీపై కూడా దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏపీసీగా వెంకటసుబ్బయ్య మూడు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంకా ఆయన ఈ శాఖపై పట్టు సాధించలేదని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారారు.
మెజార్టీ పోస్టుల ఖాళీ
సమగ్రశిక్షలో మెజార్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్ విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. అయితే అక్కడ సిబ్బంది లేని పరిస్థితి. రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉండాల్సి ఉండగా ఎఫ్‌ఏసీపై ఆయన రెండు చోట్ల పనిచేస్తున్నారు. నలుగురు రెగ్యులర్ డివిజనల్ ఇంజినీర్లకు గానూ ఒకరు కూడా లేరు. కనీసం డిప్యూటేషన్‌పై ఇతర శాఖల నుంచి ఒకరినైనా ఇక్కడికి పంపించలేదు. ఏఈలు పూర్తి స్థాయిలో ఉన్నా వారిని పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అదే విధంగా జిల్లాలోని భవిత కేంద్రాలను పర్యవేక్షించాల్సిన ఐఈ కో–ఆర్డినేటర్ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. దీనిని గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారి మమతకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమె రెండు విభాగాల్లో పర్యవేక్షించలేని పరిస్థితి ఉండటంతో భవిత కేంద్రాల నిర్వహణ దారుణంగా మారింది. బడి బయట పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ స్కూల్స్‌ను పర్యవేక్షించాల్సిన ఏఎల్‌ఎస్ పోస్టు 6 నెలలుగా ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి సీఓంఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంకా ఏఎస్‌ఓ, ఎంఐఎస్ ప్లానింగ్ కో–ఆర్డినేటర్, ఉర్దూ ఏఎంఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లా సమగ్రశిక్ష కార్యాలయం
పర్యవేక్షణ అంతంతమాత్రమే..
పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆయా విభాగాలపై పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉందనే విమర్శలున్నాయి. ఏపీసీ ప్రధానంగా నాడు – నేడు, కేజీబీవీ, భవిత, ఆల్ట్రనేటివ్ స్కూల్స్ తదితర విభాగాలను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. జిల్లాలో వైఎస్సార్‌సీపీ హయాంలో రెండో విడత కింద 1,356 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీలు, డైట్, బీఈడీ కళాశాలల్లో నాడు – నేడు పనులు మొదలుపెట్టారు. నిధులు మంజూరు కాగా 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత దీని గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖపై దృష్టి సారించి సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కలెక్టర్ అనుమతితో నియామకాలు
సమగ్రశిక్షలో ఖాళీ పోస్టుల్లో సిబ్బందిని నియమించేందుకు కలెక్టర్‌ను అనుమతి కోరుతాం. ఇందుకు సంబంధించి ఫైల్‌ను సిద్ధం చేశాం. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత అన్ని ఖాళీ పోస్టుల్లో సిబ్బంది నియమిస్తాం. అప్పటి వరకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటాం.
– వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష

సమగ్రశిక్ష.. పట్టించుకునే దిక్కేది!