
హామీలను విస్మరించడం బాబు నైజం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘మేనిఫెస్టోలోని హామీలను విస్మరించడం చంద్రబాబు నైజం. ఉద్యోగులకు మంచి పీఆర్సీ, మధ్యంతర భృతి ఇస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగం అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉర్సా వంటి కంపెనీలకు దోచిపెట్టడానికే తప్ప ఉద్యోగులకు ఇళ్ల స్థలాలివ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదన్నారు. కొత్త పీఆర్సీ ఊసేలేదన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు సుమారు 15 లక్షలుంటే 50 వేల మందికి మాత్రమే ఒకటో తేదీన జీతాలు వేస్తూ అందరికీ వేస్తున్నామని బాబు సభల్లో చెప్పుకొంటున్నారన్నారు. సీపీఎస్ విధానం కింద సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారన్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సీపీఎస్ విధానం స్థానంలో జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తానని జీఓ కూడా ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆ జీఓను పక్కనపెట్టి ఇప్పుడు వారికి మొండిచేయి చూపిస్తోందన్నారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా ఆలస్యం చేస్తోందన్నారు. ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందన్నారు. వలంటీర్లకు జీతం పెంచుతామని చెప్పి ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదన్నారు. వివిధ శాఖల్లోని చిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఎటుపోయిందో తెలియదన్నారు. కంపెనీలు పెట్టాం, ఉద్యోగాలు వచ్చాయని ప్రసంగాల్లో చెబుతున్నారని, కానీ అవి ఎక్కడున్నాయో తెలియదన్నారు. ఊరు, పేరు లేని కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అత్యంత తక్కువ ధరకు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్,
పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి