ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి
ధర్మవరం: అద్దె ఇంట్లో అవస్థలు పడుతూ దుర్భర జీవితం అనుభవించే నిరుపేదలను అపహాస్యం చేస్తూ సమాధులతో పోల్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలో వేల సంఖ్యలో ఇళ్లను పేదలకు కేటాయించి ఊళ్లను నిర్మిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలుపుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. శివానగర్‌లోని బచ్చునాగంపల్లి కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివానగర్ నుంచి దిమ్మిల సెంటర్ మీదుగా తేరుబజార్, అంజుమన్ సర్కిల్, పీఆర్‌టీ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్ మీదుగా వేలాది మంది లబ్ధిదారులతో కలసి ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కాలేజ్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 30 లక్షలకు పైగా ఇంటిస్థలాలను కేటాయించి ఇళ్లను కాకుండా ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుపడినా దృఢ సంకల్పంతో వారి కుట్రలను తిప్పి కొట్టారన్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో నిరుపేదల కోసం 1,400 ఎకరాల్లో 50 వేల పట్టాలను ఒకేసారి పంపిణీ చేసి రికార్డు సృష్టించారన్నారు. చేనేతలు, నిరుపేదలు అత్యధిక సంఖ్యలో నివసించే ధర్మవరం నియోజకవర్గంలో 13 వేలకు పైగా ఇంటిపట్టాలను పంపిణీ చేసి అన్ని సదుపాయాలతో లేఅవుట్‌లు వేశామన్నారు. తాము అధికారంలోకి వస్తే లాక్కుంటామని ఎల్లో మీడియాలో ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.
పేదల ఇంటి పట్టాలను లాక్కునేంత దమ్ముందా అని సవాల్ విసిరారు. తమది పేదలకు మంచి చేసే ప్రభుత్వమని, వారిది ప్రజలను ముందే మనస్తత్వమన్నారు. నిరుపేదలు బాగుపడితే టీడీపీ నేతలు ఓర్వలేరన్నారు. సీఎం జగన్ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజా మద్దతుతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం అవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కురుబ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కోటి సూర్యప్రకాష్‌బాబు, మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ ఎర్రగుంట భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ పెణుజూరు నాగరాజు, పట్టణ సచివాలయాల కన్వీనర్‌లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్‌లతో పాటు 40వార్డుల కౌన్సిలర్‌లు, ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment