పుట్టపర్తి టౌన్/పుట్టపర్తిరూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టర్ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో కలసి బహిరంగ సభాస్థలి, విమానాశ్రయం కాన్వాయ్ రహదారి పరిశీలించారు. అనంతరం బహిరంగ సభ, బ్యారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బందోబస్తు నిర్వహించే పోలీసులను అప్రమత్తం చేశారు.
బందోబస్తు ఇలా..
సీఎం పర్యటన నేపథ్యంలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 121 ఎస్‌ఐలు, 242 మంది ఏఎస్‌ఐలు, 509 మంది కానిస్టేబుళ్లు, 96 మంది మహిళా పోలీసులు, 244 మంది హోంగార్డులు, 3 సెక్షన్ల ఏఆర్ పోలీసులు, 8 బృందాల స్పెషల్ పార్టీ పోలీసులు భద్రతా ఏర్పాట్లకు వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఒక ప్రైవేటు క్రికెట్ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో కొత్తచెరువు, గోరంట్ల వైపు నుంచి పుట్టపర్తికి వచ్చే వాహనాలు సూపర్ ఆస్పత్రి వద్ద నుంచి బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి మీదుగా పుట్టపర్తికి చేరుకోవాలన్నారు. అలాగే నల్లమాడ, బుక్కపట్నం వైపు నుంచి పుట్టపర్తికి వస్తూ గోరంట్ల, బెంగళూరుకు వెళ్లే వాహనాలు గణేష్ సర్కిల్ నుంచి బ్రాహ్మణపల్లి వయా ఆస్పత్రి మీదుగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
సభాస్థలి దగ్గర...
పుట్టపర్తిలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ అరుణ్‌బాబు అధికారులకు సూచించారు. సభా వేదిక ప్రాంగణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, రైతులు, ప్రజలు ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు ఉండేలా చూడాలన్నారు. పాసుల జారీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గాలి, వర్షం, ఎండలను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు లక్ష మంది వరకూ బహిరంగ సభలో పాల్గొనవచ్చని అంచనా వేశారు. అందరికీ తాగునీరు సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు, డీఎస్పీ వాసుదేవన్, సీఐలు రవీంద్రారెడ్డి, రామయ్య, ఆర్‌ఐలు టైటాస్, నారాయణ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment