
ఒంటరి వృద్ధులే టార్గెట్
అనంతపురం: ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులే టార్గెట్. రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడడం.. అవసరమైతే హత్యకు తెగబడడం. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఓ కసాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ పి.జగదీష్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో పొమ్మల సావిత్రి (63) సొంతింటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఈమె భర్త అటవీశాఖలో ఉద్యోగ విరమణ చేసిన కొన్నాళ్లకు చనిపోయారు. ఈమెకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. వేరుగా కాపురం ఉంటున్నారు. సావిత్రి తన భర్త పెన్షన్ సొమ్ముతో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో గత జనవరి నెల ఆరో తేదీన ఆమె ఇంటిలోనే హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపేసిన ఆనవాళ్లు ఉండడంతో పాటు మెడలోని ఉండాల్సిన రెండు బంగారు చైన్లు, సెల్‌ఫోన్ కనిపించలేదు. కుమారుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నేర స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ల ద్వారా ఆధారాలు సేకరించారు. రక్త సంబంధీకులు, ఇరుగు పొరుగు వారిని పోలీసులు విచారణ చేశారు. అనంతరం మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి.. సీసీ కెమెరాలు ఫుటేజీలు పరిశీలించి అనంతపురం పాతూరు నీరుగంటివీధికి చెందిన షేక్ అన్సర్ అలియాస్ చీమిడోడు అలియాస్ నాకులు అలియాస్ చాబూసాను నిందితుడిగా గుర్తించారు.
రెక్కీ నిర్వహించి.. హత్య చేసి..
షేక్ అన్సర్ వెల్డింగ్ వర్కర్. ఇతడు తాగుడు, వ్యభిచారం, తదితర చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు తీర్చుకునేందుకు అప్పులు చేశాడు. అయితే తిరిగి చెల్లించడానికి తగినంత ఆదాయం లేకపోవడం.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో డబ్బు కోసం తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని.. వారి వద్ద నుంచి విలువైన ఆభరణాలు, నగదు కాజేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా రెక్కీ నిర్వహించిన తర్వాత జనవరి ఆరో తేదీన టీచర్స్ కాలనీలో టూలెట్ బోర్డు ఉన్న సావిత్రి ఇంటికి వెళ్లాడు. తనకు ఇల్లు బాడుగకు కావాలని వివరాలు అడిగిన తర్వాత తాగునీరు అడిగాడు. ఆమె లోనికి వెళ్లగానే అన్సర్ తన వెంట తెచ్చుకున్న స్టిక్కర్ బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు చైను, 16 గ్రాముల పగడాల బంగారు చైను, రెడ్‌మీ సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం చెరువుకట్ట వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కె.సాయినాథ్, సీసీఎస్ సీఐ జయపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు రాంప్రసాద్, రాజశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల తొమ్మిదో తేదీన అనంతపురం రూరల్ మండలం కురుగుంటలోని ఓ ఇంట్లో కూడా షేక్ అన్సర్ చోరీకి పాల్పడ్డాడు.రూ.34,500 చోరీ నగదును నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదింపులో శ్రమించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
కుదిరితే చోరీ.. లేకుంటే హత్య
కసాయిని అరెస్ట్ చేసిన పోలీసులు
బంగారు నగలు, నగదు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment