
జనసేన కార్యకర్త ఇంటిపై దౌర్జన్యం
ధర్మవరం అర్బన్: పట్టణంలో జనసేన కార్యకర్త ఇంటిపై టీడీపీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేతిరెడ్డికాలనీ ఎల్–4లో జనసేన కార్యకర్త శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు రేకుల షెడ్డులో హోటల్ పెట్టుకుని జీవిస్తున్నారు. శనివారం టీడీపీ నాయకుడు వీరన్న, అతని అనుచరులు గోపాల్, నరసింహులు వెళ్లి ఈ స్థలం తమదంటూ షెడ్డు ఖాళీ చేయాలని బెదిరించాడు. వారు ఒప్పుకోకపోవడంతో టీవీ, ఫ్రిడ్జ్ ఇతర సామగ్రిని బయటకు విసిరేసి.. బండరాళ్లు వేసి పైకప్పు ధ్వంసం చేశాడు. బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అడ్డుకున్నారు. రెండేళ్ల కిందట తనకిచ్చిన స్థలంలో షెడ్డు వేసుకున్నానని బాధితుడు శ్రీనివాసులు తెలిపాడు. అయితే వీరన్న తన స్థలమంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించాడు. న్యాయం కోసం కోర్టును సైతం ఆశ్రయించానని చెప్పాడు. అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడు వీరన్న, గోపాల్, నరసింహులుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment