
డయాలసిస్ రోగులపై పచ్చ పగ
ఈ చిత్రంలోని మహిళ పేరు పద్మ. పెనుకొండ మండలం తురకలాపట్నం స్వగ్రామం. ఎనిమిదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పద్మ వైద్యుల సూచన మేరకు.. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటోంది. ఇందుకోసం 50 కి.మీ దూరంలోని హిందూపురం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో వైఎస్సార్ సీపీ సర్కార్ డయాలసిస్ బాధితులను 108 వాహనం ద్వారా ఆస్పత్రులకు తీసుకువెళ్లి...తిరిగి ఇంటికి చేర్చేది. కానీ కూటమి ప్రభుత్వం డయాలసిస్ చేయించుకునే వారికి 108 ద్వారా రవాణా సౌకర్యాన్ని రద్దు చేసింది. దీంతో పద్మ ఆస్పత్రికి వచ్చి వెళ్లేందుకు ఆటోపై ఆధారపడుతోంది. ఇందుకోసం నెలకు సుమారుగా రూ.10 వేలు ఖర్చు చేస్తోంది. ఇక ఆస్పత్రిలో మందులు అందుబాటులో లేక నెలకు రూ.6 వేలు వెచ్చించి బయట కొంటోంది. ప్రభుత్వం రూ.10 వేల పింఛన్ ఇచ్చినా అవి సరిపోక అతికష్టమ్మీద కూలి పనులకు వెళ్తోంది. రవాణా సౌకర్యం లేక పద్మలా ఇబ్బంది పడుతున్న వారు జిల్లాలో వందల మంది ఉన్నారు.
చిలమత్తూరు: డయాలసిస్ రోగులపై కూటమి సర్కార్ కత్తి గట్టింది. కిడ్నీలు పనిచేయక.. ఏ పనీ చేసే వీలులేక అల్లాడిపోతున్న అభాగ్యులకు అండగా నిలవాల్సింది పోయి కీడు తలపెట్టింది. ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు, మందులు తదితర విషయాలు పక్కన పెడితే కనీసం వారిని ఆస్పత్రి వరకూ చేర్చే 108 సేవలనూ రద్దు చేసింది. దీంతో వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులు ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి రాలేక అష్టకష్టాలు పడుతున్నారు.
హిందూపురంలో యూనిట్‌లోనే 160 మంది
హిందూపురంలోని జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ సంస్థ నిర్వహిస్తోంది. రెండు పాజిటివ్, 20 నెగిటివ్ బెడ్లు ఉన్నాయి. రోజుకు 60 నుంచి 65 మందికి డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ యూనిట్‌లో హిందూపురం , మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాలకు చెందిన 160 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం డయాలసిస్ రోగులను ఆస్పత్రికి చేర్చేందుకు గతంలో ఉన్న 108 సేవలను రద్దు చేసింది. దీంతో రోగులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం సరిగా లేక ఒకేసారి రానుపోను కలిసి ఆటో మాట్లాడుకుంటున్నారు. దీంతో ఒకసారి ఆస్పత్రికి రావాలంటే రవాణా ఖర్చే కనీసంగా రూ.500 వెచ్చించాల్సి వస్తోంది. ఇలా ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కొక్కరికి మందులు, రవాణా ఖర్చులు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు అవుతోంది.
వేధిస్తున్న మందుల కొరత
కూటమి సర్కార్ డయాలసిస్ రోగులకు మందులను సరఫరా చేయలేక చేతులెత్తిసింది. కీలకమైన మందులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులు వాటిని బయట కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో నెలకు మందుల ఖర్చే రూ.5 వేలు వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల మందులను అందివ్వాలని కోరుతున్నారు.
108 సేవలను రద్దు చేసిన కూటమి సర్కార్
పింఛన్ డబ్బుకు మించి అధికంగా ఖర్చులు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న
కిడ్నీ వ్యాధిగ్రస్తులు

డయాలసిస్ రోగులపై పచ్చ పగ
Comments
Please login to add a commentAdd a comment