పట్టుతప్పుతున్న టీనేజ్
టీనేజీ పట్టు తప్పుతోంది. సినిమాలు కూడా విపరీతంగా ప్రభావితం చేస్తుండటంతో యువతీ యువకులు చేస్తున్న తప్పులతో కుటుంబాలే కాదు వారి జీవితాలు కూడా దెబ్బతింటున్నాయి. వివాహమైన తక్కువ వ్యవధిలోనే విభేదాల కారణంగా పోలీసుస్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
హిందూపురం అర్బన్: పాతిక ఏళ్ల క్రితం వరకూ తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే ఎక్కువ మంది పిల్లలు నడిచేవారు. పెళ్లిళ్లు సైతం ఎక్కువ భాగం తల్లిదండ్రులు నిశ్చయించిన విధంగానే జరిగేవి. పెళ్లిళ్ల తరువాత ఏవైనా సమస్యలు వస్తే రెండు కుటుంబాలు కూర్చొని తమ పిల్లలకు సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్థలను తొలగించి భార్యాభర్తలను ఒకటి చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
వందలో 30 కేసులు
అగ్ని సాక్షిగా జీవితాంతం కలిసి ఉంటామని ఒక్కటవుతున్న ఎన్నో జంటలు .. పైళ్లెన ఆరు నెలలు, ఏడాది గడవక ముందే మనస్పర్థలతో గొడవలకు దిగుతున్నారు. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నా సంపాదన ఉండటంతో నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదనలకు దిగుతున్నారు. ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవించక పోవడం, మొండిగా వ్యవహరిస్తుండటంతో చివరకు విడాకుల దాకా వచ్చి దూరమై పోతున్నారు. వందలో 30 వరకూ ఇలాంటి కేసులే పోలీసుస్టేషన్‌లకు వస్తున్నాయి.పెద్దలు నచ్చ జెప్పే ప్రయత్నాలకే అవకాశమే ఇవ్వడం లేదు. దీంతో ఆయా కుటుంబాలు నలిగిపోతున్నాయి.
చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాలు
ఎక్కువ మంది తల్లిదండ్రులు సంపాదనపై దృష్టి పెట్టడం, పిల్లలను పట్టించుకోకపోవడం వారు వేరే వారికి ఆకర్షితులవుతుండటంతో ఇబ్బందులొస్తున్నాయి. దీనికితోడు సినిమాలు, సామాజిక మాధ్యమాలు, ఓటీటీలు, సీరియళ్ల ప్రభావం యువత మనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి. హైస్కూల్, ఇంటర్ చదివే వయస్సు నుంచే ప్రేమ వ్యవహారాలు ప్రారంభమై పక్కదారి పడుతున్నాయి.
ప్రేమ, పెళ్లి అంటూ ఎంతో మంది యువతీ యువలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబాల్లో అలజడి రేగుతోంది. సంపాదనలో ఇరువురు తీసిపోకపోవడం, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వక పోవడం, ఇరువురిలో అహం పెరగడం, అత్తమామలు, ఆడపడుచులు ఉన్నారన్న సాకులతో ఎక్కువ జంటలు విడిపోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ మంచి, చెడ్డలను వివరించి వివాహ వయసు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మేలు.
– రాజగోపాల్‌నాయుడు,
పట్టణ సీఐ, హిందూపురం
సినిమాలు, సామాజిక మాధ్యమాలతో యువత పెడదారి
పైళ్లెన తక్కువ వ్యవధిలోనే విడాకుల బాట
పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణ
కుటుంబాలకు మనోవేదన మిగుల్చుతున్న వైనం
Comments
Please login to add a commentAdd a comment