ద్విచక్ర వాహనానికి నిప్పు
హిందూపురం అర్బన్ : మండల పరిధిలోని మోత్కుపల్లిలో శనివారం రాత్రి తిప్పన్న అనే వ్యక్తి చెందిన ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో వాహనం కాలిబూడిదైంది. ఈ ఘటనపై బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ధర్మవరం అర్బన్: పట్టణంలోని కదిరిగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన మృతి చెందాడన్నారు. మృతుని ఆచూకీ తెలిస్తే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు చెప్పారు.
నరబలి కేసులో ఇద్దరి అరెస్ట్
పావగడ: నరబలి కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలమేరకు.. పశ్చిమ దిక్కుకు వెళ్లి నరబలి ఇస్తే నిధులు దొరుకుతాయని తాలూకాలోని కోటగుడ్డకు చెందిన జ్యోతిష్కుడు రామకృష్ణ... కుందిర్పి మండలానికి చెందిన ఆనందరెడ్డికి చెప్పాడు. దీంతో ఈ నెల 9న పావగడ నుంచి పడమటి దిక్కుగా ఉండే చళ్లకెరె తాలూకా పరశురాంపురం గ్రామానికి ఆనందరెడ్డి వెళ్లాడు. పక్కా ప్లాన్ ప్రకారం స్థానిక బస్టాండ్‌లో చెప్పులు కుట్టే చర్మకారుడు ప్రభాకర్‌తో మాట కలిపాడు. అతను పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా తానూ అదే దారిలో వెళ్తున్నానని.. ఇంటి వద్ద విడిచిపెడతానని నమ్మబలికాడు. మార్గ మధ్యలో నిందితుడు ఆనందరెడ్డి వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో ప్రభాకర్‌పై దాడి చేయడంతో అతను చనిపోయాడు. విచారణ అనంతరం పోలీలసులు జ్యోతిష్కుడు రామకృష్ణ , కుందిర్పి ఆనందరెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 22 వరకూ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఆమిద్యాలలో భారీ చోరీ
● 20 తులాల బంగారు, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
ఉరవకొండ: మండల పరిధిలోని ఆమిద్యాల గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దొంగలు ఇంట్లో బీరువాలోని 20 తులాల బంగారుతో పాటు రూ1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఆమిద్యాలకు చెందిన దర్జీ నారాయణరావు, సర్వసతీ దంపతులు 10 రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెంగళూరుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి 20 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు కేసు నమోదు చేసుకొని క్లూస్‌టీం సహాయంతో వేలిముద్రలను సేకరించారు.
ద్విచక్ర వాహనానికి నిప్పు
Comments
Please login to add a commentAdd a comment