వందశాతం ప్రగతి సాధించాలి
హిందూపురం టౌన్: ప్రాథమిక, అర్బన్, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో అన్ని పారామీటర్లలో నూరుశాతం ప్రగతి సాధించాలని వైద్యాధికారులకు డీఎంహెచ్‌ఓ ఫైరోజ బేగం సూచించారు. ఆదివారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని పీపీ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాసరెడ్డితో పాటు పీహెచ్‌సీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. అలాగే ప్రభుత్వాస్పత్రిలోని కాన్పుల వార్డు ఎస్‌ఎన్‌సీయూ విభాగాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. అలాగే పరిగి రోడ్డులోని ఆర్‌కే నర్సింగ్ హోమ్‌ను సందర్శించి పీసీపీఎన్‌డీటీ రిపోర్టులను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ ఫైరోజ బేగం మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, అనవసర మందులు ఉపయోగించి అనర్థాలు తెస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుతో పాటు ఆర్‌ఎంపీలు వైద్యం అందించే కేంద్రాల్లో తగిన చర్యలు తీసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 14 మంది వైద్యులతో ఏడు కమిటీలను ఇదివరకే నియమించామన్నారు. ఆర్‌ఎంపీలు పేరుకు ముందు ‘డాక్టర్ ‘అని‘ క్లినిక్’ అని బోర్డులలో ఉండకూడదని, కేవలం ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండేలా చూడాలన్నారు. హద్దుమీరి వైద్యం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్‌సీడీ సర్వేలో జిల్లాలో లక్ష్మీపురం ఆరోగ్య కేంద్రం చివరి స్థానంలో ఉండడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యులు పద్మజ, ఆనంద్‌బాబుతో పాటు పరిసర పీహెచ్‌సీ వైద్యులతో బాటు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment