కాలువనో, వంకనో కాదు.. ఏకంగా నదినే ఆక్రమించాడో రియల్టర్
చిత్రావతి నదిపై అనధికారికంగా నిర్మించిన బ్రిడ్జి
చిలమత్తూరు: జిల్లాలోని ప్రధాన నదుల్లో ‘చిత్రావతి’ ఒకటి. హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల మీదుగా ప్రవహించే ఈ నది పరివాహక ప్రాంతం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. నదిలో నీటి ప్రవాహం సాఫీగా కొనసాగితే వేలాది ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాలకు తాగునీరు అందుతుంది. కానీ ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలు, ఇసుక తరలింపు వంటి వాటితో నది ఉనికి కోల్పోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చిత్రావతి పరిరక్షణకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. చిలమత్తూరు మండలంలో రెడ్డెప్ప శెట్టి అనే వ్యక్తి చిత్రావతిని ఆక్రమించి ఏకంగా బ్రిడ్జి నిర్మించినా పట్టించుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. బెంగళూరులో నివాసం ఉంటున్న రెడ్డెప్పశెట్టి ప్రముఖ రియల్టర్. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట చిలమత్తూరు మండలం మొరసలపల్లి, కోడూరు, నారేముద్దేపల్లి, మర్రిమాకులపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటికీ కంచె వేసుకుని పెద్ద వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నాడు. అందులోకి బయటి వ్యక్తులెవరూ వెళ్లలేని పరిస్థితి.
అనధికారికంగా బ్రిడ్జి నిర్మాణం
చిత్రావతి నదికి ఇరువైపులా రెడ్డెప్పశెట్టి వ్యవసాయ క్షేత్రం విస్తరించి ఉంది. దీంతో నదీ పోరంబోకు భూములను సైతం తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. సుమారు 19 ఎకరాలను ఆక్రమించుకుని కంచె వేయడంతో పాటు కోడూరు సమీపంలో నదిపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలు సాగిస్తున్నాడు. సాధారణంగా నదులపై బ్రిడ్జీల నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదు. ఉన్నతస్థాయిలో అనుమతులు తీసుకోవాలి. అదీ ప్రజావసరాలకు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎలాంటి అనుమతులూ ఇవ్వరు. కానీ ఇక్కడ స్థానిక అధికారులను లోబరుచుకుని అక్రమ నిర్మాణం చేపట్టారు. అతని ‘సామ్రాజ్యం’లోకి వెళ్లేందుకు సామాన్యులకు అవకాశం ఉండదు. చుట్టూ కంచె ఉండటంతో అటుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఇదే అదనుగా అక్రమ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు స్పష్టమవుతోంది.
నదీ జలాల మళ్లింపు
బ్రిడ్జి నిర్మాణంతోనే ఆగకుండా నదిలో చెక్‌డ్యాంలు కట్టి.. వ్యవసాయ క్షేత్రంలోని పెద్దపెద్ద ఫారం పాండ్లకు నీటిని మళ్లించుకుంటున్నారు. చెరువులకు వచ్చే నీటి దారులను ఫారం పాండ్లకు మళ్లించారు. ఫలితంగా దిగువ ప్రాంతానికి నీరు రావడం లేదు. రెడ్డెప్పశెట్టి అరాచకాలపై పలు గ్రామాల రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసినా..ఏమాత్రమూ పట్టించుకోలేదు. పైగా అతనికే అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
నదిని ఆక్రమించిన రియల్టర్
చిత్రావతిపై బ్రిడ్జి నిర్మాణం
నదీ జలాల అక్రమ వినియోగం
పట్టించుకోని అధికార యంత్రాంగం
బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతి తీసుకోలేదు
చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని మా దృష్టికి వచ్చింది. ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అదీ ప్రజలకు అవసరం అనుకుంటేనే అనుమతులు మంజూరు చేస్తాం. ప్రజావసరాలు లేనప్పుడు నదిపై బ్రిడ్జి నిర్మించడం తప్పు. హద్దులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ వారికి లేఖ రాశాం. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మళ్లీ లేఖ రాస్తాం. మేము నేరుగా చర్యలు చేపట్టడానికి లేదు. రెవెన్యూ వాళ్లే తీసుకోవాలి.
– యోగానంద, ఇరిగేషన్ డీఈ
Comments
Please login to add a commentAdd a comment