పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది
సాక్షి, పుట్టపర్తి పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు – ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే తరహాలో పెత్తనం చెలాయిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు పుట్టపర్తి, మడకశిర, హిందూపురంలో ప్రజలకు వింత పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎమ్మెల్యే కాకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను పక్కకు నెట్టి.. షాడోలు హవా సాగిస్తుండటం గమనార్హం.
ఉనికి కోసం ఆరాటం
గడిచిన ఎన్నికల్లో టికెట్ రాలేదు. ప్రజలు మరిచిపోకుండా ఉండాలంటే నిత్యం జనాల్లో ఉంటూ ఉనికి చాటుకోవాలనే క్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి షాడో ఎమ్మెల్యే అవతారమెత్తారు. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కంటే ఆమెకు మామ అయిన పల్లె రఘునాథరెడ్డి ప్రతి విషయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలో నేరుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గానికి వచ్చిన కొత్త అధికారులు కూడా ఆయనను భేటీ అయి శాలువా కప్పి సన్మానం చేస్తుండటం విశేషం.
మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ హవా
ఎస్సీ రిజర్వుడు స్థానమైన మడకశిరలో పెత్తందారుడు అయిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హవా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు లేకున్నా.. ఆయన స్థానంలో గుండుమల ఉంటూ ఆదేశాలు ఇస్తుండటం గమనార్హం. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ఎవరైనా.. పెత్తనం మాత్రం గుండుమలదే అన్న చందంగా మడకశిరలో పాలన తయారైంది. అధికారుల బదిలీలు, పాలనా వ్యవహారాలతో పాటు కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉంటూ ఎమ్మెల్యే హోదాలో అధికారం చెలాయిస్తున్నారు.
హిందూపురంలో బాలయ్య పీఏలదే పెత్తనం
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో హిందూపురం నియోజకవర్గంలో ఆయన మార్కు లేదనే చెప్పాలి. చుట్టపుచూపుగా వస్తూ రిబ్బన్ కటింగ్ కార్యక్రమాల్లో ఫొటోలకు ఫోజులు ఇచ్చి వెళ్తుంటారు. అయితే షాడో ఎమ్మెల్యేల తరహాలో ఆయన పీఏలు ఇక్కడ రాజ్యమేలుతున్నారు. గత పదేళ్లుగా హిందూపురంలో ఇలాంటి పరిస్థితే దాపురించింది.
ధర్మవరంలో శ్రీరామ్ చక్రం
ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ ఉన్నప్పటికీ.. చాలా విషయాల్లో టీడీపీ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ జోక్యం చేసుకుంటున్నారు. అధికారులను బదిలీలు చేయిస్తానని.. తాను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి హోదాలో ఉన్నానని చెబుతూ పెత్తనం చెలాయిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ తరఫున హరీష్‌బాబు, జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి.. ఎవరికి వారుగా షాడో ఎమ్మెల్యే అవతారమెత్తి అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇక రాప్తాడులో పరిటాల సునీత ఎమ్మెల్యే అయినప్పటికీ.. అక్కడ ఆమె కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయిస్తున్నారు.
కలవరపెడుతోన్న ఐవీఆర్‌ఎస్ సర్వే
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా పార్టీల నేతలు ఎవరికి వారుగా ప్రజాక్షేత్రంలో ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) నిర్వహిస్తుండటం కలవరపెడుతోంది. పరిటాల శ్రీరామ్, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, గుండుమల తిప్పేస్వామి వ్యవహార శైలిపై పలువురికి ఫోన్ కాల్స్ వచ్చాయి. దీనిపై కూటమి పార్టీలోని కొందరు నాయకుల కుట్ర ఉందని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం విశేషం. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ప్రాబల్యం తగ్గించేందుకు కందికుంట ప్లాన్ వేశారని తెలిసింది.
పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలో వింత పరిస్థితులు
షాడో ఎమ్మెల్యేల తీరుతో తలలు పట్టుకుంటోన్న అధికారులు
ధర్మవరం, రాప్తాడులో పరిటాల శ్రీరామ్ అనుచరుల హల్‌చల్
అధికారులతో సమీక్షలు నిర్వహించి అడ్డదిడ్డంగా ఆదేశాలు జారీ
పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది
Comments
Please login to add a commentAdd a comment