నేడు ఎస్పీ కార్యాలయంలో ‘పరిష్కార వేదిక’
పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
జీబీఎస్‌పై ఆందోళన వద్దు
పుట్టపర్తి అర్బన్: జీబీఎస్ (గిలన్ బారీ సిండ్రోమ్)పై ఆందోళన అవసరం లేదని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం పేర్కొన్నారు. రోగ నిరోధక వ్యవస్థ పరిధిలోని నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో కండరాల బలహీనత ఏర్పడే వ్యాధి జీబీఎస్ అని వివరించారు. ఇది చాలా అరుదైన వ్యాధని, ఇది అంటువ్యాధి కాదని తెలిపారు. వైరస్, బ్యాక్టీరియాల సంక్రమణ అనంతరం ఇది వస్తుందని వెల్లడించారు. వ్యాధి లక్షణాలు వేగంగా తీవ్రమవుతాయన్నారు. చూడడానికి అంతా ఆరోగ్యంగానే ఉంటూ రక్త పరీక్షల్లో నాడీ, రక్త పోటు నార్మల్ గానే కనిపిస్తాయన్నారు. దేశంలో మొదటి కేసు పూనేలో నినిర్ధారణ అయ్యిందని, జిల్లాలో ఇంత వరకూ ఒక్కటీ నమోదు కాలేదని తెలిపారు.
వ్యాధి లక్షణాలు
నరాల బలహీనతతో కాళ్లు, చేతులు, చచ్చుబడడం, గొంతు పొడి బారడం, ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఇందుకు పలు జాగ్రత్తలను సూచించారు. కాళ్లు, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ వాడినప్పుడు, సమూహాల్లో ఉన్నప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. అసాధారణ నీరసం, కాళ్లు చేతులు తిమ్మిర్లు ఉన్నప్పుడూ, ఫ్లూ జ్వరం లక్షణాలు ఉన్నప్పుడు, మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. రోగ నిరోధక శక్తి పెంచడానికి ఇమ్యునో గ్లోబిన్ ఇంజెక్షన్ ఇస్తారని తెలిపారు.
కదులుతున్న బస్సు..
కిటికీలో కాళ్లు
గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి నిద్రించి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సైటెర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. నేడు ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment