రాజుకున్న భూ వివాదం
పెనుకొండ రూరల్: కియా కార్ల తయారీ పరిశ్రమ సమీపంలో భూ వివాదాలు రాజుకుంటున్నాయి. రెండు వారాల కిందట స్వల్ప వివాదం చోటు చేసుకుంది. తాజాగా ఆదివారం భూ సమస్యతో ఒక వర్గంపై మరో వర్గం దాడికి తెగబడింది. వివరాలిలా ఉన్నాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు, గుంతకల్లుకు చెందిన ప్రభాకర్‌కు మునిమడుగు పొలం సర్వే నంబర్ 433లో 1.12 ఎకరాలు, గుట్టూరు పొలం సర్వే నంబర్ 324లో 61 సెంట్ల భూమి ఉంది. దీనికి ఫెన్సింగ్ వేసి.. ఆదివారం చదును చేయిస్తున్న సమయంలో బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ అనుచరులు సాయితేజ, వీరాంజనేయులు, బోయ వినోద్‌కుమార్ మరికొందరు అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. ఇక్కడ ఎనిమిది సెంట్ల స్థలం ఎంపీపీకి చెందినది ఉందంటూ ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు. జేసీబీతో ప్రహరీని కూలదోశారు. అడ్డుకోబోయిన ప్రభాకర్‌పై ఇనుపరాడ్లు, కట్టెలు, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కేకలు వేయడంతో ఎంపీపీ అనుచరులు అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం బాధితుడు ఘటనపై కియా ఏరియా పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమందించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని, ఎంపీపీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరానన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరికొంతమంది పరారీలో ఉన్నారని చెప్పారు.
పల్లె అనుచరుడిపై దాడి
పొలంలో ఫెన్సింగ్, ప్రహరీ కూల్చివేత
రాజుకున్న భూ వివాదం
Comments
Please login to add a commentAdd a comment