మహిళా కూలీ దుర్మరణం
మడకశిర: ట్రాక్టర్ ప్రమాదంలో మహిళా కూలీ దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండంపల్లి దొమ్మరహట్టికి చెందిన కొల్లమ్మ (45) ట్రాక్టర్ కూలీగా వెళ్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం కూలి పనికి వచ్చింది. ట్రాక్టర్ పరిగి నుంచి ఇసుకను లోడ్ చేసుకుని మడకశిరకు వస్తుండగా వ్యవసాయ మార్కెట్ వద్దకు రాగానే ఇంజిన్ – ట్రాలీకి మధ్యన గల ఇనుపరాడ్ విరిగి పోయింది. ట్రాక్టర్ ట్రాలీలో ఇసుకపై కూర్చున్న కొల్లమ్మ జారి కిందకు పడిపోయింది. క్షణాల్లో ట్రాలీ చక్రం తలపై వెళ్లడంతో కొల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆడుకుంటూ రైలెక్కేశాడు!
● హిందూపురం స్టేషన్‌లో దిగిన
యలహంక బాలుడు
హిందూపురం అర్బన్: కర్ణాటక రాష్ట్రం యలహంక రైల్వే స్టేషన్ సమీపంలో సరిత అనే మహిళ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్టేషన్ వద్ద ఆడుకుంటున్న ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ముఖేష్‌సింగ్ రైలు ఎక్కాడు. అది కాసేపటికే కదిలింది. అలా హిందూపురం రైల్వే స్టేషన్‌లో ఆ బాలుడు బోగీ నుంచి కిందకు దిగాడు. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్న బాలుడిని పోలీసులు గమనించారు. వివరాలు ఆరా తీయగా.. యలహంక తమ ఊరు అని చెప్పాడు. దీంతో పోలీసులు యలహంక రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఆటో డ్రైవర్ బాలుడి ఫొటోను గుర్తుపట్టి తల్లికి విషయం చెప్పాడు. ఆమె హుటాహుటిన హిందూపురం వచ్చింది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచుకున్న బాలుడిని సీఐ జనార్దన్ తల్లి సరితకు అప్పగించాడు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
శతాధిక వృద్ధుడు కన్నుమూత
రాయదుర్గంటౌన్: పట్టణానికి చెందిన మున్సిపల్ విశ్రాంత ఉద్యోగి ఎస్.అమీరుద్దీన్‌సాబ్ (104) అనారోగ్యంతో సోమవారం ఉదయం 6.30 గంటలకు చనిపోయారు. ఈయన భార్య 40 ఏళ్ల క్రితమే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గుకు కుమార్తెలు ఉన్నారు. సాయంత్రం బళ్లారి రోడ్డులోని ఖబర్‌స్థాన్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుమారుడు మెహబూబ్‌బాషా తెలిపారు.
మహిళా కూలీ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment