చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
పుట్టపర్తి టౌన్: అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు చట్టపరిధిలో న్యాయం చేస్తామని ఎస్పీ రత్న భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 75 మంది తమ సమస్యలపై ఎస్పీకి అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, మహిళా పోలీస్టేషన్ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఎస్పీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థలం ఆక్రమించి.. మాపైనే రివర్స్ కేసులు
చిలమత్తూరు మండలం మురుసవాండ్లపల్లి పొలం 244–2 సర్వేనంబర్‌లో 64 సెంట్ల భూమికి సంబంధించి తమ వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయని, అయినా అధికార పార్టీకి చెందిన శ్రీనివాసులు, వెంకటేషులు తమ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటున్నారని అశ్వత్థరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. తమపైనే ఆక్రమణదారులు రివర్స్ కేసు పెట్టారని తెలిపాడు. చంపుతామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని కోరాడు. ఎస్పీ స్పందిస్తూ చిలమత్తూరు పోలీసులకు ఫోన్ చేసి విచారణ చేసి న్యాయం చేయాలని ఆదేశించారు.
అడవికి నిప్పు పెడితే చర్యలు
అడవికి నిప్పు పెడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పలుచోట్లు ఆకతాయిలు, గొర్రెల కాపరులు కొండలకు, అడవులకు నిప్పు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. నిప్పు పెట్టడం వల్ల దట్టమైన అడవులు అంతరించిపోతున్నాయని తెలిపారు. వందలాది వన్య ప్రాణులు అగ్నికి ఆహుతైపోతున్నాయన్నారు. ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యాన రైతులు, పశుపోషకులు కూడా తీవ్రంగా నష్టపోతారన్నారు. అడవులను, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
బాధితులకు ఎస్పీ రత్న భరోసా
Comments
Please login to add a commentAdd a comment