
అంతా వాళ్లు చెప్పినట్లే వినాలి
కనుమలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం
● టీడీపీ నేతల కనుసన్నల్లో ఆలయం
● కనుమ లక్ష్మీనారసింహస్వామి ఆదాయం రూ.లక్షల్లో ఉన్నా పట్టించుకోని దేవదాయ శాఖ
● ప్రశ్నార్థకంగా 183 ఎకరాల మాన్యం భూమి
చిలమత్తూరు: జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆస్తులకు రక్షణ కరువైంది. పాలక మండలి సభ్యులందరూ స్థానికులే కావడం, టీడీపీ నేతల కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు కొనసాగించాల్సి రావడంతో విసుగు చెందిన దేవదాయ శాఖ అధికారులు ఆలయ నిర్వహణను గాలికి వదిలేశారు. ఫలితంగా 183 ఎకరాల దేవుడి మాన్యం పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే రూ. కోట్లు విలువ చేసే మాన్యం భూములను కబ్జా చేసే ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయని, దేవుడి స్థిరాన్ని అన్యాక్రాంతం కావడం ఖాయమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు పక్కదారి
చిలమత్తూరు సమీపంలోని కనుమలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం రూ. లక్షల్లోనే ఉంటోంది. హుండీ, విరాళాల రూపంలో ఏటా రూ.15 లక్షలకు పైబడే ఆదాయం ఉంటోందని భక్తులు అంటున్నారు. దీనికి స్వామి వారి భూముల్లో పంటలు సాగుచేస్తున్న రైతులు చెల్లిస్తున్న కౌలు అదనంగా ఉంటోంది. అయితే ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి వెచ్చించడంలో దేవదాయ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ఆలయ పాలక మండలి సభ్యులు అక్రమాలకు తెరలేపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ. కోట్లలో స్థిరాస్తులున్నా ఆలయ అభివృద్ది, నిర్వహణను గాలికి వదిలేసి, నిత్య పూజలు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే ఆలయానికి ఆదాయమే లేదు, సొంత డబ్బు పెట్టుకుని పూజలు సజావుగా జరిగేలా చూస్తున్నామని ఆలయ పాలక మండలి సభ్యులు పేర్కొనడం గమనార్హం.
అన్యాక్రాంతమైన స్థిరాస్తులు
కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి చిలమత్తూరులోని భూముల్లో ఇప్పటి వరకూ చాలా భాగం అన్యాక్రాంతమైంది. మరి కొంత స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. దేమకేతేపల్లి సమీపంలో 183 ఎకరాల పైచిలుకు భూములున్నాయి. ఇందులోనే 544ఈ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 2.50 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన రూ.50 లక్షల పరిహారాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించలేదు. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా స్థానిక భక్తులు పేర్కొంటున్నారు. ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకూ అధికారికంగా అభివృద్ధి కమిటీని సైతం దేవదాయ శాఖ అధికారులు నియమించలేదు. దీంతో ఆలయ పాలక మండలి సభ్యులుగా స్థానిక టీడీపీ నేతలు అనధికారికంగా కొనసాగుతూ ఆలయ అభివృద్ధిని గాలికి వదిలేశారనే పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిలమత్తూరు మండలంలోని కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పేరుకు మాత్రమే దేవదాయ శాఖ పరిధిలో ఉంది. ఆలయ పాలక మండలి కమిటీ లేదు. ఇప్పటి వరకూ స్థానికులే ఆలయ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఉత్సవాలు కూడా వారే నిర్వహిస్తుంటారు. ఆదాయం, తదితర అంశాలకు సంబంధించిన విషయాలేవీ మాకు తెలియవు... వారు తెలపరు కూడా. అంతా వాళ్లు చెప్పినట్లు వినాలి. ఆలయ స్థిరాస్తుల పరిరక్షణ మాత్రమే మా బాధ్యత.
– నరసింహమూర్తి,
కార్యనిర్వహణాధికారి, దేవదాయశాఖ
పట్టించుకోని దేవదాయ శాఖ
కనుమ లక్ష్మీనారసింహస్వామి ఆలయం దేవదాయ శాఖ పరిదిలో ఉన్నా ఏనాడూ ఆలయ అభివృద్ధి గూరించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ ఆదాయం, ఉత్సవాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోంది. రూ. కోట్లు విలువ చేసే మాన్యం ఉన్నా ఈ ఆలయానికి ఈఓ లేకపోవడం, ఆలయ ఆదాయంపై కనీసం దృష్టి పెట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న లోకల్ పాలకమండలి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామికి చెందిన 183 ఎకరాల మాన్యం భూములకు రక్షణ కరువైంది. ఈ భూములను చాలా మంది రైతులు కౌలుకు చేస్తున్నారు. వారిచ్చే ధాన్యం, లేక నగదుపై లెక్కలేమీ ఉండడం లేదు. హుండీ, విరాళాలు వీటన్నింటికీ అధికారిక లెక్కలేవీ చూపడం లేదు. వచ్చే ఆదాయమంతా ఏమవుతుందో ఒక్క నరసింహస్వామికి , లోకల్ పాలక మండలి సభ్యులకు తప్ప మూడో కంటికి తెలియడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

అంతా వాళ్లు చెప్పినట్లే వినాలి
Comments
Please login to add a commentAdd a comment