
25 నుంచి లేపాక్షిలో ఉత్సవాలు
లేపాక్షి: ఈ నెల 25 నుంచి లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రమానందన్, ఈఓ నరసింహమూర్తి మంగళవారం తెలిపారు. 15వ శతాబ్దం నాటి ఆలయం కావడంతో ఇక్కడ నిర్వహించే ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 25న మాఘ బహుళ ద్వాదశి నాడు విశేష పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల జాగారణ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కళాకారుల వివిధ సాంస్కృతిక కార్యాక్రమాలు ఉంటాయి. భజనలు, శాసీ్త్రయ నృత్యనీరాజనాలు ఉంటాయి. 28న రాత్రి పూల పల్లకీ ఉత్సవం ఉంటుంది.
కాలువలో పడి విద్యార్థి మృతి
గుమ్మఘట్ట: ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలోని నీటి ప్రవాహంలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... బేలోడుకు చెందిన అన్నపూర్ణకు 11 సంవత్సరాల క్రితం గలగల గ్రామానికి చెందిన లోకేష్‌తో వివాహమైంది. అనారోగ్యంతో 2020లో అన్నపూర్త మృతి చెందింది. అప్పటి నుంచి వారి కుమారుడు జాని పోషణను అమ్మమ్మ హనుమక్క, తాత హనుమప్ప తీసుకున్నారు. ప్రస్తుతం జాని (7) బేలోడులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన జాని.. మధా్‌య్‌హ్నం తోటి స్నేహితుడు లక్కీతో కలసి గ్రామ సమీపంలోని బీటీపీ సాగునీటి కాలువ వద్దకెళ్లాడు. అప్పటికే సిద్దంగా ఉంచుకున్న గాలాన్ని తీసి కాలువలో వేసే క్రమంలో జాని ప్రమాదవశాత్తు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. ఆ సమయంలో లక్కీ కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లోని రైతులు అక్కడకు చేరుకుని జానీని వెలికి తీశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళితే.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పోస్టల్ ఉద్యోగిని అదృశ్యం
ముదిగుబ్బ: మండలంలోని దొరిగిల్లు పోస్టాఫీసులో పనిచేస్తున్న అనూష రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఆమె తల్లి ఈశ్వరమ్మ మంగళవారం ఫిర్యాదు చేశారు. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన అనూష సోమవారం విధులకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరింది. ఓ దుకాణం వద్ద తనను ఉండమని చెప్పి వెళ్లిన కుమార్తె తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత దుర్మరణం
కణేకల్లు: ద్విచక్ర వాహనంఅదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వివాహిత దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన సత్యనారాయణ, అనసూయమ్మ (38) దంపతులు. మంగళవారం ఉదయం బొమ్మనహళ్ మండలంలోని కృష్ణాపురంలో జరిగిన బంధువుల పెళ్లికి తన భార్యతో కలసి ద్విచక్ర వాహనంపై సత్యనారాయణ వెళ్లాడు. అనంతరం రాయదుర్గం మండలంలోని కదరంపల్లిలో ఉన్న అత్తారింటికి బయలుదేరాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అనసూయమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన బోయ ఈశ్వర్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... నిరుపేద కుటుంబానికి చెందిన ఈశ్వర్‌కి రెండేళ్ల క్రితం డి.హిరేహళ్ మండలం పులకుర్తి గ్రామానికి చెందిన కావేరితో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కూలీ పనులతో కుటుంబాన్ని పోషించుకునే ఈశ్వర్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయమని భార్య పలుమార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన ఆమె కుమారుడిని పిలుచుకుని మంగళవారం సాయంత్రం తన పుట్టింటికెళ్లింది. దీంతో అత్తింటి వారు మందలిస్తారేమోననే అనుమానంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు తాము నివాసముంటున్న గుడిసెలోనే ఈశ్వర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి సమాచారంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

25 నుంచి లేపాక్షిలో ఉత్సవాలు

25 నుంచి లేపాక్షిలో ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment