
ఉద్యోగులతో బంతాట
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు పుణ్యమా అని జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఉన్నతాధికారులు సైతం ఉద్యోగం చేయాలంటే భయపడుతున్నారు. ఎప్పటివరకూ ఉంటామో.. ఎప్పుడు బదిలీ చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. శాఖల హెచ్‌ఓడీలకే దిక్కులేకుండా పోయిన పరిస్థితి. రాజకీయ జోక్యంతో రాత్రికి రాత్రే బదిలీలు జరుగుతుండటంతో పనిచేయాలంటేనే మనసొప్పడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు తమ పనులు చేయకుంటే మెడపై కత్తి పెట్టి మరీ బదిలీ చేయిస్తున్న దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా కలెక్టర్ పూర్తిగా నిశ్చేష్టులై చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్‌ఈ బదిలీతో అలజడి..
కూటమి సర్కారు వచ్చేనాటికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు విద్యుత్ శాఖ ఎస్‌ఈగా సురేంద్ర ఉండేవారు. ఈయనపై రాజకీయ ముద్రవేసి అనంతపురం జిల్లా ఎస్‌ఈగా తెచ్చారు. మడకశిర ఎమ్మెల్యే రాజు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తదితరులు సంతకాలు చేసి మరీ ఆయన్ను తీసుకొచ్చారు. అయితే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంపత్‌కుమార్ నాలుగు నెలలు పని చేశారో లేదో ఉన్నఫళంగా రెండు రోజుల క్రితం బదిలీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా విద్యుత్‌శాఖలో అలజడి మొదలైంది.
ఐదుగురు ఎస్పీలు..
కూటమి సర్కారు వచ్చాక జిల్లాకు ఐదుగురు ఎస్పీలు వచ్చి వెళ్లారు. ఎస్పీలపై ఇక్కడి నాయకులు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఉన్న అన్బురాజన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్నాళ్లకే బదిలీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ బర్దార్, గౌతమి శాలి, మురళీ కృష్ణలు వచ్చిన రెండు మాసాలకే తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుత ఎస్పీ జగదీష్‌పై కూడా బదిలీ కత్తి వేలాడుతోందని అంటున్నారు.
సంతకం చేయకుంటే ఊడినట్లే..
కూటమి ప్రభుత్వంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరీ భ్రష్టు పట్టింది. ఇక్కడ ఐదు నెలల్లో ఐదుగురు కమిషనర్లు మారారు. నేతలు చెప్పిన చోట సంతకం చేయకపోతే మరుసటి రోజే బదిలీ కావాల్సి వస్తోంది. మేఘ స్వరూప్ అనంతరం నాగరాజు, రామలింగేశ్వర్, మల్లికార్జునరెడ్డిలు బదిలీ అయ్యారు. తాజాగా బాలస్వామి వచ్చారు. ఈయన ఎన్నాళ్లుంటారో తెలియని పరిస్థితి. దీంతో కార్పొరేషన్‌లో పాలన స్తంభించి పోయింది.
రెండు నెలలు తిరక్కముందే ఏఎస్పీపై..
శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ డీఎస్పీగా ఉన్న ఆర్ల శ్రీనివాసులుకు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది.అదే జిల్లాకు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా పనిచేస్తున్న సమయంలో ఉన్నఫళంగా ఆయనకు బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. ఆ జిల్లా ఎస్పీకి నచ్చలేదని అడిషనల్ ఎస్పీని బదిలీ చేయించారనే విమర్శలొస్తున్నాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఎప్పుడు పడితే అప్పుడు బదిలీలు
ఆరుమాసాల్లో ఐదుగురు ఎస్పీలను మార్చిన వైనం
అనంతపురం కార్పొరేషన్‌లో ఇష్టారాజ్యంగా కమిషనర్ల మార్పు
తాజాగా విద్యుత్ శాఖ ఎస్‌ఈ బదిలీ
అటకెక్కిన పాలన
Comments
Please login to add a commentAdd a comment