
మహిళల భద్రతకు భరోసానివ్వాలి
● జిల్లా స్థాయి మహిళా సదస్సులో ఎస్పీ రత్న
పుట్టపర్తి అర్బన్: మహిళల భద్రతకు భరోసానివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ రత్న అన్నారు. ‘మహిళల భద్రత – భవిష్యత్తుకు భరోసా’ పేరుతో మంగళవారం పెడపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరై మాట్లాడారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాల్య వివాహాలు, సైబర్ క్రైం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మొబైల్‌ను మంచికి వినియోగించాలని సూచించారు. రోజూ ఓ నియోజకవర్గం చొప్పున మార్చి 15వ తేదీ వరకూ సదస్సులు ఉంటాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి నేర రహిత జిల్లాగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల చేకూరే అనర్థాలపై చైతన్యపరిచారు. సైబర్ క్రైం, హనీ ట్రాప్ వలలో పడరాదన్నారు. అనంతరం ఉమెన్ ప్రొటెక్షన్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాల నియంత్రణపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఎస్పీ విజయ్‌కుమార్, ఆర్డీఓ సువర్ణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం, ఐసీడీఎస్ పీడీ సుధావరలక్ష్మి, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, పెడపల్లి సర్పంచ్ మంగ్లీబాయి, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.
చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గుంతకల్లు టౌన్: ధర్మరక్ష వ్యవస్థాపకుడు, తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం గుంతకల్లు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పొట్టిశ్రీరాములు సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభనుద్దేశించి చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ.. మత ప్రబోధకుల్లో 90 శాతం మంది సరిగా లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నినదిస్తే హైదరాబాద్‌లోని ఒవైసీతో పాటు ఇతరులకు వణుకు పుట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రతిచోటా హిందుత్వానికి శత్రువులు ఎక్కువయ్యారని, సెక్యులర్ వాదులను తాను శిఖండీలుగా అభివర్ణిస్తున్నానని అన్నారు.

మహిళల భద్రతకు భరోసానివ్వాలి
Comments
Please login to add a commentAdd a comment