
సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి
జి.శివప్రసాద్‌యాదవ్
ధర్మవరం అర్బన్/పెనుకొండ: సత్ప్రవర్తన అలవర్చుకుంటే మెరుగైన జీవితం ఉంటుందని సబ్‌జైల్‌లోని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.శివప్రసాద్‌యాదవ్ సూచించారు. ధర్మవరం, పెనుకొండలోని సబ్‌జైళ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. వంట గది, స్టోర్ రూం, బ్యారక్‌లు, రికార్డులు పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. కోర్టు కేసుల్లో వాదించేందుకు న్యాయవాది లేకపోతే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు బాలసుందరి, బిల్లే రవి, పారా లీగల్ వలంటీర్ షామీర్‌బాషా, విశ్రాంత న్యాయవాది అశ్వత్థనారాయణ, ఉప్పర నరసప్ప, ఆయా జైళ్ల అధికారులు పాల్గొన్నారు.
యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి మృతదేహం లభ్యం
గుంతకల్లు రూరల్: కనిపించకుండా పోయిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు 24 గంటలు గడవక ముందే హంద్రీనీవా కాలువలో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లుకు చెందిన యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు తిరుమలరెడ్డి (45) గత ఆదివారం బుగ్గ సంగాల క్షేత్రం సమీపంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆయన మృతదేహం గుంతకల్లు–మద్దికెర మార్గంలోని హంద్రీ–నీవా ప్రధాన కాలువలో సోమవారం కొట్టుకువచ్చింది. తల, ముఖం, కాళ్లపై ఉన్న గాయాలను బట్టి తిరుమలరెడ్డి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, తిరుమలరెడ్డి అదృశ్యమైన ప్రాంతంలో దెబ్బతిన్న ఆయన బైక్ తప్ప ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, వ్యక్తుల పేర్లను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని ఇప్పటికే తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

సత్ప్రవర్తన అలవర్చుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment