
లంచం కొట్టు.. దస్త్రం పట్టు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ధర్మవరంలోని సబ్ రిజిస్ట్రార్ అధికారులపై పెత్తనం చెలాయిస్తూ కార్యాలయాన్ని అవినీతికి నిలయంగా మార్చేశారు. దీంతో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు సెంట్‌కు ఒక రేటు, ఎకరానికి ఒక రేటు చొప్పున ధరను అధికారులు నిర్ణయించి అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఇక్కడ అధికారులు చెప్పిన ధర చెల్లించకపోతే పని ముందుకు సాగడం లేదు. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా లంచం ఇవ్వని వారి దస్తావేజులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో దస్తావేజుల లేఖరుల ఏజెంట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. స్వీకరించిన అవినీతి సొమ్ములో కూటమి పార్టీల నేతలకు కొంత ముడుపులు చెల్లిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఏటా రూ.150 కోట్ల ఆదాయం..
జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్‌లు జరిగే ప్రాంతాలలో ధర్మవరం ఒకటి. గతంలో ఒక్క ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిఽధిలో నెలకు 500 నుంచి 800 వరకు దస్తావేజులు రిజిస్ట్రర్ అయ్యేవి. తద్వారా ప్రభుత్వానికి రూ.1.20కోట్ల నుంచి రూ.1.50కోట్ల వరకూ ఆదాయం సమకూరేది. అప్పట్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ భారీగా జరుగుతుండేది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తిష్టవేసి లావాదేవీలన్నీ పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. వారు రిజిస్ట్రర్ చేయమంటే అధికారులు చేస్తారు.. వద్దు అంటే ఆపేస్తున్నారు.
మూడు భాగాలుగా పంచుకున్న నేతలు..
ధర్మవరం పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పంచుకున్నట్లుగా సమాచారం. పట్టణంలోని బెంగుళూరు రోడ్డు, పుట్టపర్తి రోడ్డు వైపు రిజిస్ట్రేషన్లు టీడీపీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. అనంతపురం రోడ్డు వైపు బీజేపీ నాయకులు, రేగాటిపల్లి జాతీయ రహదారి వైపు జనసేన నాయకుల పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల నాయకులు ఒప్పందం చేసుకుని మరీ అక్రమాలకు తెరలేపారు. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైన వెంచర్ వేయాలన్నా, గతంలో వేసిన వెంచర్‌లకు సంభందించిన ప్లాట్లు రిజిస్ట్రర్ చేయాలన్నా ఆయా పార్టీల నాయకులకు కప్పం చెల్లించి అనుమతి తీసుకుంటేనే రిజిస్ట్రేషన్‌కు అధికారులు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఈ దోపిడీ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా మందగించింది. ఒకప్పుడు 800 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం 200 నుంచి 300కు మించడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది.
కంచె చేను మేసిన చందంగా అందిన కాడికి దండుకుంటున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు . ఎంతలా అంటే లంచం ముట్టజెప్పందే ఒక్క పనీ చేయడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఈ మొత్తం ప్రక్రియ కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం. తమ స్వలాభం కోసం అవినీతి అధికారులకు నేతలు వత్తాసు పలుకుతుండడంతో సామాన్య ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.
మంత్రి పీఏ హల్‌చల్
ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను మంత్రి సత్యకుమార్ పీఏ హరీష్‌బాబు తరచుగా తనిఖీ చేస్తూ వివరాలు ఆరా తీస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తనదైన శైలిలో కార్యాలయ అధికారులను, సిబ్బందిని బెదిరిస్తూ అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని హెచ్చరించినట్లుగా సమాచారం. ఎమ్మెల్యే, మంత్రి హోదాలో చేయాల్సిన తనిఖీలను ఓ పీఎ చేపట్టడం ధర్మవరం చరిత్రలో ఇంత వరకూ ఎన్నడూ జరగలేదని రియల్టర్లు అంటున్నారు. అలాగే టీడీపీ, జనసేన నాయకులు క్రమం తప్పకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తాము చెప్పినట్లే రిజిస్ట్రేషన్లు జరగాలని అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడం ప్రశ్నార్థకమేనని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లంచం కొట్టు.. దస్త్రం పట్టు

లంచం కొట్టు.. దస్త్రం పట్టు
Comments
Please login to add a commentAdd a comment