
బాడుగకిస్తే బాధే మిగులుతోంది!
● అనంతపురం రాజు రోడ్డులోని ఓ ఆప్టికల్ (కళ్లద్దాల) భవనాన్ని భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. అనంతరం అమ్మిన వ్యక్తికే అద్దెకిచ్చారు. ఆ తర్వాత భాస్కర్ రెడ్డికి సదరు వ్యక్తి అద్దె ఇవ్వకుండా మొండికేశారు. తన బంధువులతో కోర్టులో కేసు వేయించారు. అష్టకష్టాలు పడిన భాస్కర్ రెడ్డి ఎలాగోలా మూడేళ్ల తర్వాత తన భవనాన్ని సొంతం చేసుకోగలిగారు.
● భవనానికి బాడుగ ఇవ్వక, ఖాళీ చేయక ఇబ్బంది పెడుతున్నారని ఇటీవల ఓ ఫిర్యాదుదారు అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు ఓ న్యాయవాదిని పిలవగా.. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఈ రెండే కాదు.. జిల్లాఅంతటా ఇదే పరిస్థితి. అద్దెకు తీసుకున్న వాళ్లు సరిగా బాడుగ డబ్బు కట్టక, భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో ఓనర్లు నానా తంటాలు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘మనవాళ్లే కదా.. అంతా బాగుంటుంది లే’ అనుకుంటూ భవనాన్ని అద్దెకిచ్చిన పాపానికి ఓనర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అద్దెదారులు చివరకు ‘ఖాళీ చేయం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ ధిక్కరిస్తున్న పరిస్థితి. పైగా కోర్టుకు వెళ్లడం.. ఇప్పుడే ఖాళీ చేయలేమని గడువుతో కూడిన స్టే ఆర్డర్ తెచ్చుకోవడం.. ఆ గడువు కూడా ముగిసినా ఖాళీ చేయకపోవడం... ఇదీ దుస్థితి. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో భవన యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అద్దె కరెక్టుగా ఇచ్చేవారికి కూడా కొందరి ఆగడాలతో బాడుగకు భవనం దొరకడం కష్టతరమవుతోంది.
‘క్రాంతి’.. భ్రాంతి
అనంతపురం గుత్తిరోడ్డులోని ఓ అద్దె భవనంలో క్రాంతి హాస్పిటల్ నడుస్తోంది. నెలకు అద్దె రూ.3.25 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. 2021లోనే భవనం అద్దె లీజు ముగిసింది. ఈ క్రమంలో భవనాన్ని ఖాళీ చేయాలని అనేక సార్లు ఓనరు అడిగినా స్పందన లేకుండా పోయింది. పైగా గడిచిన 14 నెలల నుంచి అద్దె కూడా చెల్లించలేదు. దీంతో భవన యజమాని నగేష్ 2024 డిసెంబరులో ఎస్పీకి ఫిర్యాదు చేయగా... పరిష్కారం చూపాలంటూ అనంతపురం త్రీ టౌన్ పోలీసులను ఆయన ఆదేశించారు. అయితే, సదరు పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆస్పత్రి వద్ద భవన యజమాని బుధవారం ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆస్పత్రి నిర్వాహకుడు మురళి దిగిరాకపోగా బాధితుడిపైనే దౌర్జన్యం చేశారు. ‘దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ బెది రించాడని నగేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
వందలాది కేసులు..
అనంతపురంలోనే కాదు కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు పట్టణాల్లోనూ ఇలాంటి కేసులు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సగటున రోజుకు 10 కేసులు నమోదవుతున్నాయి. అద్దెకున్న వారు ఖాళీ చేయకపోవడంతో బిల్డింగ్ యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది విదేశాల్లో ఉంటూ ఇక్కడ అద్దెకిస్తే ఆ ఇళ్లకు ఏకంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కుదువకు పెట్టిన వారూ ఉన్నట్లు సమాచారం.
భవనాలను ఖాళీ చేయని అద్దెదారులు
అవసరమైతే కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లు
చేసేది లేక పోలీసులను
ఆశ్రయిస్తున్న ఓనర్లు
పోలీసుల వద్దకు
రోజుకు 10 పైనే కేసులు
అద్దె ఇప్పించే ఉద్యోగం కాదు మాది
అద్దెకిచ్చిన ఇంటికి రెంటు ఇప్పించడమో, ఖాళీ చేయించేడమో చేసే ఉద్యోగం కాదు మాది. ఇలాంటి వాటి జోలికొస్తే సివిల్ పంచాయితీల్లో ఎందుకు తలదూరుస్తారు అంటారు. అందుకే కోర్టుకెళ్లి తేల్చుకోండి అని చెబుతున్నాం. మా పరిధిలో ఉన్నవి మాత్రమే చేస్తాం. – శాంతిలాల్, సీఐ,
త్రీటౌన్ పోలీస్ స్టేషన్
Comments
Please login to add a commentAdd a comment