
భార్యను భయపెట్టాలని భర్త డ్రామా
బత్తలపల్లి: భార్యాభర్తలు గొడవపడ్డారు. భర్త పిల్లలను తీసుకుని చనిపోతున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయాడు. భయపడిపోయిన భార్య మరిది ద్వారా డయల్ 100కు ఫోన్ చేయించడంతో పోలీసులు సెల్‌నంబర్ లొకేషన్ తెలుసుకుని సురక్షితంగా వారిని కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. గంటాపురం గ్రామానికి చెందిన కురుబ నాగభూషణ, వీరదేవి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. నాగభూషణ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తాగుడు మానాలంటూ భర్తతో గొడవపడింది. మనస్తాపానికి గురైన నాగభూషణ తాను ఇక బతకనని చెప్పి ఇంట్లోనే సెల్‌ఫోన్ వదిలేసి వెళ్లిపోయాడు. బత్తలపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న కుమారుడు, కుమార్తెను పిలుచుకెళ్లాడు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వీరదేవి కుటుంబ సభ్యులతో విషయం తెలిపింది. దీంతో నాగభూషణ తమ్ముడు హరి డయల్ 100కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపాడు. ఇంతలో వీరదేవి సెల్‌కు నాగభూషణ ఫోన్ చే సి పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నానని చెప్పి పెట్టేశాడు. తన భర్త కాల్ చేసిన విషయం పోలీసులకు తెలియజేయడంతో వారు సదరు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు, బాధితుల బంధువులు కదిరికి వెళ్లి నాగభూషణతో పాటు పిల్లలను తీసుకువచ్చారు. ఎస్‌ఐ సోమశేఖర్ కౌన్సెలింగ్ నిర్వహించగా.. తన భార్యను భయపెట్టేందుకు పిల్లలను చంపి, తాను చస్తానని బెదిరించానని తెలిపాడు. ఇలాంటి ఆకతాయి పనులకు దూరంగా ఉండాలని, భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించాలని హితవు పలికారు. ఇకపై అన్యోన్యంగా ఉంటామంటూ తెలిపి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయారన్నారు. సకాలంలో స్పందించిన పోలీసులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్‌కుమార్, ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్‌లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment