పవిత్ర మాసం.. ఆధ్యాత్మిక వికాసం
ఎన్‌పీకుంట/ హిందూపురం అర్బన్/ బత్తలపల్లి: ముస్లింలకు పరమ పవిత్రమైన మాసం రంజాన్. సత్కార్యాలు, మానవతా విలువలు పరిమళించే వరాల వసంతం. మానసిక ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి అవసరమైన సమస్త విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఇదే నెలలో అవతరించింది. అందుకే ఈ మాసంలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో గడుపుతారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 300 పైగా మసీదులు ఉన్నాయి. రంజాన్‌తో మసీదులన్నీ ఆధ్యాత్మక శోభను సంతరించుకున్నాయి.
30 రోజులు.. మూడు భాగాలు...
రంజాన్ మాసం 30 రోజులపాటు ఉండగా దీనిని మూడు భాగాలుగా విభజిస్తారు. ఇందులో మొదటి 10 రోజుల పాటు ఉపవాసం ఉండటాన్ని రహ్మత్ (దయను పొందటం) మొదటి భాగంగా పరిగణిస్తారు. రెండవ భాగం 10 రోజులను మగ్‌ఫిరత్ (క్షమను కోరడం)గా విశ్వశిస్తారు. చివరి 10 రోజులను జహ్హన్నం సే నజాత్ (నరకం నుంచి విముక్తి) గా చూస్తారు. మూడో భాగంలో వచ్చే 21, 23, 25, 27, 29వ రాత్రులను పరమ పవిత్రమైనవిగా భావించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
ఉపవాస దీక్షలు..
పవిత్ర రంజాన్ మాసంలో రోజూ తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. పొద్దంతా ఉపవాసంతో ఆరోగ్యం దెబ్బతినకుండా పౌష్టికాహారం తీసుకుంటారు. ఉపవాస దీక్షతో ఎదుటివారి ఆకలి బాధ తెలియడంతోపాటు సహన గుణం పెరుగుతుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.
దాన, ధర్మాలు..
ప్రతి ముస్లిం తన స్థోమతకు తగినట్లు ఈ మాసంలో దాన, ధర్మాలు చేయడాన్ని విధిగా భావిస్తారు. ఒక ముస్లిం వద్ద ఏడాది పాటు ఉన్న నగదు, బంగారంతో పాటు ఇతర సంపదను లెక్క వేస్తారు. ఇందులో నుంచి కొంత భాగం జకాత్ పేరిట దానాలు చేస్తారు. ప్రతి మనిషి (గర్భంలో ఉన్న శిశువుకు సైతం) ఫిత్రా చెల్లిస్తారు. నిరుపేదలకు ఈ మొత్తం అందేలా చూస్తారు.
ప్రత్యేక ప్రార్థనలు..
ఈ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రోజూ చేసే ప్రార్థనల కన్నా తరావీహ్ నమాజ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. దురలవాట్లకు దూరంగా సత్యనిష్టగా ఉంటారు. దివ్య ఖురాన్ ప్రబోధాలను తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. వయోబేధం లేకుండా ప్రార్థనలు ఆచరిస్తారు.
ప్రారంభమైన రంజాన్ సందడి
నేటి నుంచి ఉపవాస దీక్షలు
పవిత్ర మాసం.. ఆధ్యాత్మిక వికాసం
Comments
Please login to add a commentAdd a comment