
‘చింత’కు రికార్డు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర అమాంతం పెరిగింది. సోమవారం క్వింటా రూ.40 వేలు పలికి ఈ ఏడాది గరిష్ట రికార్డును తాకింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 2146.80 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా చింతపండు గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 12,400, కనిష్టంగా రూ.4,200, సరాసరిన రూ.6 వేల ప్రకారం క్రయ విక్రయాలు సాగాయి. ఈసారి చింతపండు దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడంతో మార్కెట్‌లో మంచి ధర దక్కుతోంది.
140 మంది
విద్యార్థుల గైర్హాజరు
పుట్టపర్తి: ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమవారం జిల్లాలోని 42 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థులకు మ్యాథమ్యాటిక్స్–2బీ/జూవాలజీ–2/ హిస్టరీ పేపర్– 2 పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులు 6,339 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 6,236 మంది హాజరయ్యారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,144 మందికిగానూ 1,107 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 140 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు.
పరారీలో రెడ్డెప్పశెట్టి !
● ఇప్పటికే రెండు కేసులు..
అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి..?
సాక్షిక్షి టాస్క్‌ఫోర్స్: చిలమత్తూరు మండలం కోడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో చిత్రావతి నదీ పరివాహక భూములను ఆక్రమించిన రియల్టర్ రెడ్డప్ప శెట్టి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. చిత్రావతిపై అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంతో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెడ్డప్పశెట్టిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా తన పొలానికి వెళ్లే దారిని రెడ్డెప్పశెట్టి మూసివేయడంతో పాటు ప్రశ్నించిన తనను బెదిరించాడని స్థానిక రైతు నరసింహులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రెడ్డెప్పశెట్టిపై 341 సెక్షన్ కింద మరో కేసు నమోదు చేశారు.
కంచె వ్యవహారంలో మరో కేసు
రైతుల పొలాలకు వెళ్లేందుకు వీలు లేకుండా కంచె వేయడం, నదిని తన ఆధీనంలో ఉంచుకోవడం వంటివి రెడ్డెప్పశెట్టి మెడకు చుట్టుకుంటున్నాయి. రెవెన్యూ అధికారుల విచారణలో రెడ్డప్పశెట్టి అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని తేలడంతో ఆ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రెడ్డెప్ప శెట్టి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. రెవెన్యూ అధికారులు మరో నోటీసు ఇవ్వాల్సి ఉండగా.. ఆయన అందుబాటులో లేరని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment