
యువత పోరుతో బాబుకు బుద్ధి చెబుదాం
పరిగి: ‘చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు... చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. కనీసం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అయినా ఇస్తారంటే..అందుకూ చంద్రబాబుకు మనసు రావడం లేదు.. అలవిగాని హామీలతో నమ్మించి యువతను మోసం చేసిన సీఎం చంద్రబాబుకు ‘యువత పోరు’తో బుద్ధి చెబుదాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆమె పరిగిలో ఈనెల 12న వైఎస్సార్ సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ శ్రేణులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా.. ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కేవలం పింఛన్లు చూపుతూ ఆర్భాటం చేయడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
నయవంచన ప్రభుత్వ మెడలు వంచుదాం
ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకం కింద రూ.4,500 కోట్లు బకాయిలున్నాయని, వాటిని తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు... మాట తప్పారన్నారు. అందరూ సంఘటితమై ఈ ప్రభుత్వ మెడలు వంచుదామని ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ‘యువత పోరు’లో భాగంగా పుట్టపర్తిలో పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూ.4500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి వెంటనే విడుదల చేయాలి
12న ‘యువత పోరు’కు అన్ని వర్గాలు కలిసివచ్చి విజయవంతం చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు,
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment