
అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తంగా 218 అర్జీలు అందించారు. కలెక్టర్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీకి అర్థవంతమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి’ అన్న నినాదంతో ఈనెల 15వ తేదీన స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పీ–4 సర్వేను మండలాల ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, సీపీఓ విజయ్ కుమార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం పాల్గొన్నారు.
ఉగాది నుంచి జిల్లాలో పీ–4 సర్వే
‘స్వర్ణాంధ్ర–2047’లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఉగాది నుంచి పీ–4 సర్వేకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పీ–4 కార్యాచరణకు సంబంధించి వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పేదరికం లేని సమాజం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్ (పీ–4) సర్వే చేస్తోందన్నారు. కార్యక్రమం అమలుపై ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ఈనెల 25వ తేదీలోపు అభిప్రాయాలు తెలియజేసే వారికి ప్రశంసా పత్రం అందిస్తామన్నారు.
వర్మీకంపోస్టుపై అవగాహన కల్పించాలి
చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో గోరంట్ల గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ స్టాల్‌ను ఆయన సందర్శించారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment