
పారిశుధ్య కార్మికుడి ఆత్మహత్య
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నరసింహులు (34) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం నొప్పి తీవ్రత తాళలేక కొండాపురం సమీపంలో పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి బలవన్మరణం
హిందూపురం అర్బన్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. హిందూపురంలోని ఆటోనగర్‌కు చెందిన లక్ష్మీకాంత్ (21)కు భార్య జ్యోతి, ఓ కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భిణి. తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న లక్ష్మీకాంత్ కొంత కాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తన అవసరాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బు సమకూరక ఇబ్బంది పడిన లక్ష్మీకాంత్ సోమవారం వేకువజామున ఆటోనగర్ వద్ద పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడి దుర్మరణం
ఉరవకొండ: స్ధానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండలోని ఇంద్రా నగర్‌కు చెందిన కార్తీక్ (18), నందకుమార్ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందకుమార్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ మహనంది కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment