
సిద్ధేశ్వరా.. పాహి పాహి
అమరాపురం: హేమావతిలో హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం చిన్నరథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ, ఈఓ నరసింహరాజు ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం మేళ తాళాలతో చిన్న రథంపై అధిష్టింపజేసి సిద్ధేశ్వరస్వామి మహారాజ్‌కు జై అంటూ భక్తులు అరటిపండ్లు, పూలు, బెల్లం, బొరుగులు, జిలకర్ర తదితర వాటిని రథంపైకి విసిరి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నరథాన్ని ఆలయం నుంచి హంపన్నస్వామి గుడివరకు లాగారు. రాత్రి ముత్యాల పల్లకీలో స్వామివారిని గ్రామ పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. సీఐ రాజ్‌కుమార్, ఎస్‌ఐ. ఇషాక్‌బాషా ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
నేడు బ్రహ్మరథోత్సవం
సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కరేగౌడ తెలిపారు.

సిద్ధేశ్వరా.. పాహి పాహి
Comments
Please login to add a commentAdd a comment