హామీల అమలులో ‘కూటమి’ విఫలం
సోమందేపల్లి: హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం ఆమె సోమందేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఊరికో హామీ ఇచ్చిన చంద్రబాబు... ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక డబ్బులు లేవంటూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తన అసమర్థ పాలనను ప్రశ్నిస్తారన్న భయంతోనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా దక్కకుండా కుట్ర చేస్తున్నారన్నారు. సీట్ల గురించి మాట్లాడుతున్న కూటమి పార్టీల నేతలు..రాష్ట్రంలో 40 శాతం మంది వైఎస్సార్ సీపీకి ఓటు వేసిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. కూటమిలోని మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 60 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
ప్రజలు తప్పక బుద్ధి చెబుతారు..
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రస్తుత కూటమి సర్కార్ మాత్రం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దౌర్భాగ్యపాలనకు నిదర్శనమన్నారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, ప్రతి ఒక్కరినీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి పార్టీలను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
విద్యార్థుల కోసం ఉద్యమబాట..
ఫీజురీయింబర్స్ నిధులు విడుదల చేయకుండా నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులను కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. అందుకే వైఎస్సార్ సీపీ విద్యార్థుల తరఫున ఉద్యబాట పట్టిందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీన ‘ఫీజు పోరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, జెడ్పీటీసీ అశోక్, పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, సర్పంచ్‌లు కిష్టప్ప, జిలాన్ ఖాన్, పరంధామ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబు
విద్యార్థుల కోసం
12న వైఎస్సార్‌సీపీ ‘ఫీజు పోరు’
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్
Comments
Please login to add a commentAdd a comment