
మాటకు కట్టుబడి ఉన్నా
రాప్తాడురూరల్: ‘ఈ ఈవీఎంలతోనో, మరేదో కారణంగానో గెలిచారు. నన్ను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేయాలనే దురాలోచనతో రాష్ట్రంలోని 50 వేలమంది మహిళల సొంతింటి కలను పరిటాల సునీత చిదిమేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో 7,500 ఇళ్లను 7 నెలల్లో పూర్తి చేస్తా. ఇది నా ఛాలెంజ్’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే...పరిటాల సునీతకు భయపడుతున్నారో లేదంటే ఇళ్ల నిర్మాణం బాధ్యతను వదులుకున్నారో తెలీదన్నారు. జన్మలో ఆమె కానీ, ఆమె భర్త కాని సొంత డబ్బు ఖర్చు చేసి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చారా?, పేదలకు రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టాలనే ప్రయత్నం చేశారా? అని పరిటాల సునీతను ప్రశ్నించారు.
దప్పికయినప్పుడు
బావి తవ్వాలనే విధానం..
పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి రొద్దం మండలంలోని పెన్నానది మీదుగా నీళ్లు తీసుకురావొచ్చని తాము చెప్పినా వినలేదన్నారు. దప్పికయినప్పుడు బావి తవ్వాలనే విధానంతోనే పరిటాల సునీత 2018లో జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు కాలువ నిర్మాణానికి టెండర్లు పిలిపించి 2019లో పనులు ప్రారంభించారన్నారు. ముందుగానే కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారన్నారు. ఒక రూపాయి కూడా నిధులు తేలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి సంబంధించిన కాంట్రాక్టర్‌కు రూ.170 కోట్ల నిధులు ఇప్పించి పనులు వేగవంతం చేయించామన్నారు. పూర్తిస్థాయిలో పనులు అవ్వాలంటే పదేళ్లు పడుతుందని భావించి అప్పటిదాకా ఈ ప్రాంత రైతులను ఎండబెట్టడం సరికాదని, అప్పటి సీఎం జగనన్నతో మాట్లాడి ప్రత్యేకంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చేందుకు జీఓ తెచ్చామన్నారు. తర్వాత దాతలు, రైతుల సహకారంతో 45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామని గుర్తు చేశారు.
పరిటాల సునీత తత్వం
రైతులకు బోధపడింది..
ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీళ్లున్నాయని, చంద్రబాబుతో పరిటాల కుటుంబం సన్నిహితంగా ఉంటోందని, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలున్నా పరిటాల సునీత ఏరోజూ చంద్రబాబుతోగాని, లోకేష్‌తో గాని మాట్లాడలేదన్నారు. తీరా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లు వదిలే సమయంలో రిపేరీల పేరుతో డ్యాంకు ఉన్న గేట్లు తీయించారన్నారు. వచ్చే ఏడాది నీళ్లిస్తామంటూ కట్టుకథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత తనకు లాభం లేనిదే ఏపనీ చేయదనే తత్వం రైతులకు బోధపడిందన్నారు. ఇక కమీషన్ల కోసమే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల కోసం కక్కుర్తి పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. పేరూరు డ్యాం, చెరువులను ఎండబెట్టి మీ జేబులను మాత్రం కమీషన్లతో నింపుకుంటారా?అని ప్రశ్నించారు.
ఫీజు పోరును
జయప్రదం చేయండి..
ఈనెల 12న పుట్టపర్తిలో నిర్వహించే ఫీజు ఫోరు, యువత పోరును జయప్రదం చేయాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు న్యాయవాది కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ బాలపోతన్న, పార్టీ నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, ఈశ్వరయ్య, వీరాంజి పాల్గొన్నారు.
ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7 నెలల్లో 7,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం
50 వేల మంది మహిళల
సొంతింటి కలను చిదిమేసిన
పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం
కౌంటరు దాఖలు చేయని
దద్దమ్మ ప్రభుత్వం..
ఇళ్ల నిర్మాణాల నిలుపుదలపై రాక్రీట్ సంస్థ కోర్టుకు వెళ్తే...మీ చేతకాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం కౌంటర్ వేయలేదని ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుండానే విజిలెన్స్ విచారణ ఏంటని, రాక్రీట్ సంస్థకు ఎందుకు బిల్లులు ఆపారని జడ్జిగారు ప్రశ్నిస్తే.... తమకు, ఆ సంస్థకు సంబంధం లేదని అడ్వొకేట్ జనరల్ చెప్పారని గుర్తు చేశారు. ఈ కేసు నుంచి ఏమీ సాధించలేమని భావించి కౌంటరు వేయకుండా నిలిపేశారన్నారు. 9 నెలలుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజిలెన్స్ విచారణలన్నీ పూర్తి చేశారన్నారు. మళ్లీ ఈరోజు సునీత అసెంబ్లీలో రాక్రీట్ సంస్థ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment