
ఖర్చులు నిల్.. లాభాలు ఫుల్
మడకశిరరూరల్: నియోజకవర్గంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంతోపాటు గిట్టుబాటు ధర లభిస్తోంది. దీనికితోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తుండడంతో ప్రకృతి వ్యవసాయం కింద పంటల సాగు పెరిగింది. వ్యవసాయశాఖ ద్వారా 2016లో మడకశిర మండలంలో 15 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. ఈ పద్ధతి లాభదాయకంగా ఉండటంతో మిగతా రైతులు దాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని మండలాల్లో 137 గ్రామాల్లో 25,500 మంది రైతులు ప్రకృతి పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నారు. వేరుశనగ, కంది, పూలతోటలు, మొక్కుజొన్న, మిరప, రాగి, కూరగాయలు, అరటి, వక్క, మామిడి పంటలతో పాటు అంతర పంటలను డ్రిప్ సౌకర్యంతో సాగు చేసి అధిక దిగుబడులు పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
పంటల సాగు ఇలా..
బీడ భూముల్లో నవధాన్యాల విత్తనాలు అలసంద, సజ్జ, అనుములు, అముదంతో పాటు 24 రకాల జీవ వైవిధ్య పంటల విత్తన గుళికలు సాగు చేయిస్తున్నారు. దీంతో నవధాన్యాలు పండడంతో పాటు భూమి సారవంతమై ఖరీఫ్‌లో సాగు చేసే పంటలు మంచి దిగుబడి పొందడానికి ఆవకాశం లభిస్తోంది. పొలంలో సూర్య మండల మోడల్ ఆకారం ఏర్పాటు చేసి బహుళ పంటలు, బహుళ–స్థాయి సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించి పంటలు సాగు చేయిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 15 దేశాలకు చెందిన 30 మంది విదేశీ సభ్యుల బృందం అధ్యయనం చేసింది.
లాభదాయకంగా ప్రకృతి వ్యవసాయం
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు
మడకశిర నియోజకవర్గంలో
137 గ్రామాల్లో పంటల సాగు

ఖర్చులు నిల్.. లాభాలు ఫుల్
Comments
Please login to add a commentAdd a comment