ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ

Published Tue, Mar 11 2025 12:09 AM | Last Updated on Tue, Mar 11 2025 12:09 AM

ప్రభు

ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ

కదిరి అర్బన్‌: స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యురాలి ధన దాహానికి పేదలు బలవుతున్నారు. రూ. లక్షల్లో జీతం తీసుకుంటూనే కమీషన్‌ కోసం కక్కుర్తి పడి స్కానింగ్‌లన్నీ ప్రైవేట్‌ ల్యాబ్‌కు సిఫారసు చేస్తున్నారు. ఫలితంగా ప్రతి స్కానింగ్‌కు రూ. వేలల్లో గర్భిణులు నష్టపోతున్నారు.

స్కానింగ్‌ యంత్రాలున్నా..

రోజూ 2 వేల ఓపీ ఉన్న కదిరి ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక స్కానింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి పనితీరు సక్రమంగానే ఉంది. అయినా ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా వైద్యురాలు మాత్రం వీటి సేవలను ఏ మాత్రం వినియోగించుకోవడం లేదు. ప్రతి సారీ స్కానింగ్‌కు ప్రైవేట్‌ ల్యాబ్‌కు సిఫారసు చేయడం ద్వారా రూ.వేలల్లో ఆమెకు కమీషన్‌ దక్కుతున్నట్లు సమాచారం. కమీషన్ల కక్కుర్తిలో పడిన ఆమె దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోందని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు.

అక్కడ కూడా ‘ఆమె’నే

ఈ నెల 7న కదిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన గర్భిణి పురిటి నొప్పులతో కాన్పు కోసం కదిరి ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యురాలు.. గర్భంలో సమస్య ఉందని నాలుగు స్కానింగ్‌లను ఆస్పత్రి పక్కనే ఉన్న ప్రైవేట్‌ ల్యాబ్‌లో చేయించుకుని రావాలని రాసిచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయరా? అని ఆమె బంధువులు అడిగితే ఇక్కడ అలాంటి సౌకర్యం లేదని బుకాయించినట్లు సమాచారం. దీంతో గర్భిణిని పిలుచుకుని డాక్టర్‌ చెప్పిన స్కానింగ్‌ సెంటర్‌కు బంధువులు వెళ్లారు. కాసేపటి తర్వాత స్కానింగ్‌ గదిలోకి గర్భిణిని తీసుకెళితే అక్కడ సదరు డాక్టరే ప్రత్యక్షమై స్కానింగ్‌ చేసి, రిపోర్టులు తీశారు. ఈ మొత్తం ప్రక్రియకు రూ.4,500 ఫీజును చెల్లించుకోవాల్సి వచ్చిందని, స్కానింగ్‌లో ఎలాంటి అనుమానాస్పద రిపోర్టులూ రాలేదని బాధితులు వివరించారు. ఇదే తరహాలో రోజూ పదుల సంఖ్యలో గర్భిణులను ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లకు పంపుతూ నిర్వాహకుల నుంచి కమీషన్లను ప్రభుత్వ గైనకాలజిస్ట్‌ దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

స్కానింగ్‌లన్నీ ప్రైవేట్‌ ల్యాబ్‌కు

ఆస్పత్రిలో స్కానింగ్‌ సౌకర్యమున్నా కమీషన్‌ కోసం కక్కుర్తి

గర్భిణులకు రూ.వేలల్లో ఖర్చు

ఈ విషయం తెలుసు

ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు రూ.45 లక్షలు విలువ చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయినా డాక్టర్‌ బయటకు రాసిస్తున్నారు. ఈ విషయం తెలుసు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు కూడా అందాయి. తీరు మార్చుకోవాలని ఆమెకు చెప్పినా పట్టించుకోవడం లేదు. బాధితులు ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ హుస్సేన్‌, సూపరింటెండెంట్‌,

కదిరి ఏరియా ఆస్పత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ 1
1/2

ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ

ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ 2
2/2

ప్రభుత్వ డాక్టర్‌ అత్యాశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement