
చంద్రబాబు మోసం చేశారు
పెనుకొండ రూరల్: డిమాండ్ల సాధనలో భాగంగా సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి సీఐటీయూ నేతృత్వం వహించింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడచిన అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలకు పరిష్కారం దొరకలేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలకు రూ.26 వేలు కనీస వేతనం చెల్లించాలన్నారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవులను కనీసం 3 నెలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఫ్రీ స్కూల్ విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇవ్వాలని కోరుతూ కార్యాలయ ఏఓ గిరిధర్ నాయక్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాబావలి, రంజిత్ కుమార్, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు జయమ్మ, జయతుంబి, లక్ష్మీదేవి, పార్వతి, శాంతిబాయి, సరస్వతి తదితురులు పాల్గొన్నారు.
ఆర్డీఓ కార్యాలయం ఎదుట
అంగన్‌వాడీల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment