
‘పోలీసు స్పందన’కు 55 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (స్పందన)కు వివిధ సమస్యలపై 55 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించారు. సమస్య తీవ్రత అడిగి తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
పల్లె అక్రమాలపై
ఈడీ విచారణ చేయించాలి
● కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు
చేసిన ఎంపీపీ ఆదినారాయణయాదవ్
సాక్షి, పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్, విద్యాసంస్థల పేరుతో ఫీజుల దోపిడీ ద్వారా రూ.వేల కోట్లు సంపాదించారని, వీటన్నింటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణ చేయించాలని ముదిగుబ్బ ఎంపీపీ, బీజేపీ నాయకుడు ఆదినారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక పల్లె రఘునాథరెడ్డితో పాటు బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి, ఇంకొందరు కలసి తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం సంకేపల్లి వద్ద వాహనంపై రాళ్లతో దాడి చేశారని, ఇప్పుడు పుట్టపర్తికి వస్తుండగా దారి పొడవునా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. కియా వద్ద ఉన్న తన భూమిని కాజేసే ప్రయత్నంలో భాగంగా పల్లె రఘునాథరెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దొంగ పత్రాలు, నకిలీ అగ్రిమెంట్లతో బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ భూ వివాదాలతో మంత్రి సత్యకుమార్‌కు సంబంధం లేకున్నా.. తరచూ వీటిలోకి లాగుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment