వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కామాంధుడి బారి నుంచి తనను తాను కాపాడుకునే క్రమంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా... అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు, జీవితంపై విరక్తితో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.
● నార్పల: లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నార్పలలోని సుల్తాన్‌పేట కాలనీకి చెందిన కవిత(26), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్న వెంకటశివ శనివారం రాత్రి గ్రామ శివారులో విడిచిన గొర్రెల వద్దకు కాపలాకు వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన అదే కాలనీకి చెందిన యువకుడు బండి లక్ష్మీనారాయణ... ఇంట్లోకి చొరబడి కవితాపై అత్యాచార యత్నం చేశాడు. ఆ సమయంలో కేకలు వేస్తూ అతని బారి నుంచి బయటపడిన ఆమె... లోపలి గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అదే సమయంలో తలుపులు బద్ధలుగొట్టేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించడంతో దిక్కుతోచని స్థితిలో కవిత ఉరి వేసుకుంది. ఇంతలో శబ్ధాలకు చుట్టుపక్కల వారు.నిద్ర లేచి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి లక్ష్మీనారాయణ పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించిన స్థానికులు అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కవితను గమనించి సమాచారం ఇవ్వడంతో వెంకటశివ అక్కడకు చేరుకుని బోరున విలపించాడు. రెండేళ్లుగా కవితను బండి లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే కవితను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడంటూ తల్లి నాగసుబ్బమ్మ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ కౌలుట్లయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
● పెద్దవడుగూరు: మండలంలోని గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన రైతు తలారి రాము(43) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న రాము... మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులకు వడ్డీల భారం పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతున్న రాము... ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.
● కూడేరు: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం కలగళ్లకు చెందిన అమర్‌నాథ్(28) మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లోకి చేరుకుని తలుపులు వేసుకుని నిద్రించాడు. ఇంటి బయట నిద్రించిన తండ్రి కొండయ్య ఆదివారం ఉదయం లేచి తలుపులు తీయాలని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment