నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా విన్నవించుకోవాలని సూచించారు.
నేడు ఎస్పీ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు.
అమ్మూ...
ఇక నేను బతకలేనమ్మా!
● బేకరీ షాపు నిర్వహకుడు ఆత్మహత్య
బత్తలపల్లి: బేకరీ వ్యాపారం సరిగా జరగకపోవడంతో కుమార్తె వివాహం, కుమారుడి చదువుకు డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక షాపు నిర్వాహకుడు సతమతమయ్యాడు. రోజూ ఇదే ఆలోచనలు చేసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘అమ్మూ.. ఇక నేను బతకలేనమ్మా’ అంటూ చెప్పి ఉరివేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కేరళకు చెందిన పరంబత్ జయప్రకాష్ (55) 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి వలస వచ్చాడు. తొలుత ఓ బేకరీలో పనిచేసేవాడు. తర్వాత కదిరి రోడ్డులో సొంతంగా ‘మైసూర్ బేకరీ’ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీకళ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి జపాన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కుమార్తె రిన్షా, బెంగళూరులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న కుమారుడు రోహన్ ఉన్నారు. అయితే కొంత కాలంగా వ్యాపారం సరిగా జరగడం లేదు. దీనికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణం తొలగిస్తారని ఆందోళనకు గురయ్యేవాడు. ఈ విషయమై భార్యతో అమ్మూ(రిన్షా) వివాహం ఎలా చేయాలి, అప్పూ (రోహన్) చదువులకు డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థం కాలేదని చెబుతూ మదనపడుతుండేవాడు. ఎప్పటికప్పుడు భార్య ధైర్యం చెప్తూ వస్తోంది. బెంగళూరులో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి భార్య లక్ష్మీకళ శనివారం వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న జయప్రకాష్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూతురుకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతానమ్మా.. ఇక బతకను’ చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే కూతురు బెంగళూరులో ఉన్న తల్లికి విషయం చెప్పింది. బత్తలపల్లిలోని ఇంటి సమీపంలో ఉన్న సాంబశివుడు(హోటల్ శివ)కు లక్ష్మీకళ ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. శివ వెళ్లి చూసేసరికి జయప్రకాష్ బేకరీ షెడ్‌లో ఉరికివేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. అనంతరం కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఏసీబీ పేరుతో సైబర్
నేరగాళ్ల వల
● రూ.50 వేలు పోగొట్టుకున్న లైన్‌మెన్
ధర్మవరం అర్బన్: విద్యుత్ శాఖ లైన్‌మెన్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారి పేరు చెప్పి లైన్‌మెన్ నుంచి రూ.50 వేలు దండుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఏఈ నాగభూషణంకు శనివారం అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ ఆఫీస్‌లో సీనియర్ ఉద్యోగి పేరు చెప్పాలని అడిగితే లైన్‌మెన్ నాగరాజు పేరును ఏఈ చెప్పారు. వెంటనే లైన్‌మెన్‌ను కాన్ఫరెన్స్‌లోకి తీసుకున్నారు. ‘మీరు చాలా అక్రమాలకు పాల్పడ్డారని మాకు ఫిర్యాదు వచ్చింది. మీపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తాం’ అని లైన్‌మెన్‌కు చెప్పారు. ఇప్పుడు తాను ఏమి చేయాలి సార్ అని లైన్‌మెన్ అడిగితే ‘మాకు రూ.5 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తా’ అని అటువైపు వ్యక్తి లంచం అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని ఏఈ తెలపడంతో చివరకు రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వెంటనే ఫోన్‌పేలో రూ.50 వేలు వేయించుకున్నారు. ఎవరికీ చెప్పకుండా 2 గంటల వ్యవధిలోపు మిగిలిన డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని సదరు వ్యక్తి బెదిరించారు. ఇదేదో సైబర్ నేరగాళ్ల పని అని అనుమానం రావడంతో వెంటనే వన్‌టౌన్ పోలీసులను సంప్రదించి, ఫిర్యాదు చేశారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక