విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
పుట్టపర్తి టౌన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ మీటర్ రీడర్లు గురువారం ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఉమ్మడి జిల్లా మీటర రీడర్ల సంఘం అధ్యక్షుడు కిరణ్‌కమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అంజనేయులు మాట్లాడుతూ... స్మార్ట్ మీటర్ విధానంతో గత 15 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రీడర్లు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను విద్యత్ శాఖలోకి విలీనం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్కా అకౌంట్ ద్వారా ప్రతి నెలా జీతాలు చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి, 27న సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే ఏఫ్రెల్ 4న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఈ కార్యాలయ ఎస్‌ఏఓ రామస్వామికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు షనవాజ్, రాఘవరెడ్డి, బాబా, నరేష్, రవి, నగేష్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 27న ‘స్థానిక’ ఎన్నికలు
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు ఎంపీపీ,
నాలుగు ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండల పరిషత్ అధ్యక్ష స్థానాలతో పాటు నాలుగు మండలాల్లో ఉపాధ్యక్ష పదవుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఎన్నికల విభాగం ఏర్పాటైంది. రొద్దం మండలం లోచర్ల ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన పి.చంద్రశేఖర్, రామగిరి మండలం రామగిరి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా పని చేసిన మీనుగ నాగమ్మ మరణించడంతో ఆ రెండు మండలాల్లో ఎన్నిక అనివార్యమైంది. గాండ్లపెంట మండలం గొడ్డువెలగల ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా పని చేసిన కాటం జగన్‌మోహన్, కణేకల్లు మండలం గనిగెర ఎంపీటీసీగా గెలిచిన హరిజన సంధ్య, కంబదూరు మండలం ములకూరు ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన తిమ్మ రాజమ్మ తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆయా స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అలాగే ఉరవకొండ మండలం బూదగవి మండల ఉపాధ్యక్షుడు నరసింహులు ఎంపీపీగా, పెద్దపప్పూరు మండల ఉపాధ్యక్షుడు జి.వెంకట్రామిరెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రెండు మండలాల్లో వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. యల్లనూరు మండల వైస్ ఎంపీపీగా పని చేసిన వెంకటరంగయ్య, రాయదుర్గం మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ నాయుడు అకాల మరణంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment