కదిరి అర్బన్: మండలంలోని బాలప్పగారిపల్లి సమీపంలో ఉన్న బావిలో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని పురుషుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసున్న వ్యక్తిగా అంచనా వేశారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94409 01882కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
కర్ణాటక మద్యం కేసులో
ఇద్దరికి జైలు
పెనుకొండ: కర్ణాటక మద్యం తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ పెనుకొండ జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... 2020, ఫిబ్రవరి 20న పెనుకొండలోని దర్గాపేటకు చెందిన మహబూబ్‌బాషా, వహబ్ కర్ణాటక మద్యం తరలిస్తూ అప్పటి ఎస్‌ఐ హరూన్‌బాషాకు పట్టుబడ్డారు. ఈ కేసు వాదనలు అప్పటి నుంచి పెనుకొండలోని జేఎఫ్‌సీఎం న్యాయస్థానంలో కొనసాగుతూ వచ్చాయి. నేరం చేసినట్లుగా అంగీకరించడంతో ముద్దాయిలకు ఏడాది జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బొజ్జప్ప తీర్పు వెలువరించారు. దీంతో ముద్దాయిలను కోర్టు వద్ద నుంచి నేరుగా సబ్‌జైల్‌కు పోలీసులు తరలించారు.
జూదరుల అరెస్ట్
తలుపుల: మండలంలోని నూతనకాల్వ సమీపంలో పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన సమయంలో 8 మంది పేకాట ఆడుతూ పట్టుపడ్డారన్నారు. వీరి నుంచి రూ.7,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సెంట్రల్ వర్సిటీలో
సమస్యలు పరిష్కరించండి
బుక్కరాయసముద్రం: మండలంలోని జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి సంఘాల నాయకుడు యశ్వంత్ డిమాండ్ చేశారు. సమస్యలపై బుధవారం వర్సిటీ వద్ద విద్యార్థులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీలో నెలకొన్న సమస్యలపై ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఇప్పటి వరకూ నాలుగు దఫాలుగా వినతి పత్రాలు సమర్పించినా ఫలితం దక్కలేదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజులు తగ్గించాలని అనేక మార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు ఒకే పరిధిలో ఉంటాయని, అయితే ఇతర ప్రాంతాల్లోని వర్సిటీల్లోని ఫీజులకు అనంతపురంలోని వర్సిటీలోని ఫీజులకు రూ.వేలల్లో వ్యత్యాసం ఉంటోందని తెలిపారు. హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్ వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థులు వెంకట్రావ్, యశ్వంత్, విలియం, ధనరాజ్, రాము, అమరేష్, అమర్, ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.