
పోలీసులు నిశ్చేష్టులై..
జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ పడగ విప్పింది. రాజకీయ పబ్బం కోసం పచ్చని పల్లెల్లో అగ్గి రాజేస్తూ.. నిత్యం గొడవలు సృష్టిస్తున్న వైనం పాత ‘రక్తచరిత్ర’ రోజులను గుర్తుకు తెస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పరిటాల రవి ఆధ్వర్యంలో ఆర్‌ఓసీ పేరుతో జరిగిన దమనకాండ మళ్లీ ఇప్పుడు జరుగుతోందనే చర్చ జనంలో మొదలైంది. తాజాగా పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్య హత్య ఉమ్మడి జిల్లాను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. లింగమయ్యను స్వయానా పరిటాల సునీత బంధువులే చంపినట్టు తేలింది. 2019–2024 మధ్య వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్షన్ ఛాయలనేవే లేకుండా చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వంలో ‘పచ్చ’ నేతలు ఊరూరా గ్రూపులను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థులను మట్టుబెట్టే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
అరాచకాలు అంతులేని విధంగా జరుగుతున్నా ఇటు అనంతపురం, అటు శ్రీ సత్యసాయి జిల్లాల పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినా ఎస్పీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతల అడుగులకు ఖాకీలు మడుగులొత్తుతున్నారన్న విమర్శలున్నాయి. రెండు జిల్లాల్లోనూ ఏమాత్రమూ సాధారణ పరిస్థితులు లేవని, పోలీసులు రాజకీయ నాయ కులకు జీ హుజూర్ అంటుండటంతో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా, సెటిల్‌మెంట్‌లు ఉన్నా పరిటాల అనుచరులు వాలిపోతున్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. భూముల కబ్జాలు, బెదిరింపులు, వసూళ్లు ఒకెత్తయితే... హత్యలు మరోఎత్తు. తమకు ఎదురుతిరిగితే చాలు కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులు చేస్తూ భయకంపితుల్ని చేస్తున్నారు.
అప్పట్లో ఆర్వోసీ పేరుతో..
పరిటాల సునీత భర్త పరిటాల రవి బతికున్న కాలంలో ఆర్‌ఓసీ (రీ ఆర్గనైజేషన్ కమిటీ) పేరుతో జరిగిన హత్యలకు లెక్కలేదు. వందల మందిని చంపేసి ఆచూకీ లేకుండా చేశారన్న ఆరోపణలున్నాయి. రవిని ఎదిరించడం కాదు, ఆ ఆలోచన వచ్చినా అలాంటి వారిని తెల్లారేసరికి లేకుండా చేసేవారని, ‘ఆర్వోసీ’ దాష్టీకానికి 700 మందికి పైగా బలై ఉంటారని అప్పుట్లో రవి అనుచరులుగా ఉన్న వాళ్లే చెబుతున్నారు.
ఈ హత్యల వెనుకా పరిటాల అనుచరులే!
● 2015 ఏప్రిల్ 29న పట్టపగలే రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ భూమిరెడ్డి ప్రసాదరెడ్డిని దారుణంగా నరికి చంపారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయంగా అడ్డుగా ఉన్నాడని ప్రసాద్ రెడ్డిని పరిటాల అనుచరులు మట్టుబెట్టినట్టు విమర్శలున్నాయి.
● 2018 మార్చి 30న అనంతపురం రూరల్ మండలం కందుకూరులో శివారెడ్డిని దారుణంగా నరికి చంపారు. గ్రామంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసి మంచి పేరు తెచ్చుకున్న శివారెడ్డిని చంపడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోయారు. ఈ కేసులో ఇటీవలే ఐదుగురు ముద్దాయిలకు జిల్లా కోర్టు ‘డబుల్’ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేసులో రాజీకి రావాలని మృతుడి బంధువులను బెదిరించారంటే ఏస్థాయిలో బరితెగించారో అంచనా వేయొచ్చు.
● గత ఏడాది అక్టోబర్ 10న వైఎస్సార్‌సీపీకి చెందిన గూలి కేశవరెడ్డిని హత్య చేశారు. హత్యలు చేస్తే తమకు ఇక ఎవరూ ఎదురు రారనే ఉద్దేశంతో దారుణానికి ఒడిగట్టారని తెలిసింది. ఇటీవల ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో బాలన్న అనే వ్యక్తిపై పరిటాల సునీత సమీప బంధువులు హత్యాయత్నం చేశారు. తాజాగా పాపిరెడ్డి పల్లికి చెందిన లింగమయ్యపై దాడి చేసి చంపారు. హంతకులు సునీతకు దగ్గరి బంధువులు కావడం గమనార్హం. రామగిరి ఎంపీపీ ఎన్నికల విషయంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా లింగమయ్య ఉన్నాడనే అక్కసుతో హతమార్చారని తేలింది.
అడ్డొస్తే హతమే..
వైఎస్సార్ సీపీ హయాంలో
ఐదేళ్లూ ప్రశాంతంగా పల్లెలు
కూటమి సర్కారులో దమనకాండ
గ్రామాల్లో పరిటాల అనుచరుల వీరంగం
ఎదురు తిరిగితే గొడ్డళ్లు,
వేటకొడవళ్లతో దాడులు
పరిటాల రవి హయాంలో జరిగిన
హత్యాకాండను గుర్తుకు తెస్తున్న వైనం

పోలీసులు నిశ్చేష్టులై..