
ముస్లింల ద్రోహి చంద్రబాబు
● వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం దుర్మార్గం
● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్
కదిరి టౌన్: వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో టీడీపీ, జనసేన ఎంపీలతో మద్దతు ఇప్పించిన చంద్రబాబు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. గురువారం ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కుటుంబం ఆది నుంచీ ముస్లింల మంచి కోరిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆ రిజర్వేషన్‌ల వల్లే నేడు ఎందరో ముస్లింలు డాక్టర్లు, ఇంజినీర్లు, గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముస్లింలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేయడానికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారన్నారు.
చంద్రబాబు జాదూ..
నారా చంద్రబాబు పెద్ద జాదూ అని మక్బూల్ విమర్శించారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో... ఏ పార్టీతో సంబంధం పెట్టుకుంటారో... ఏం మాట్లాడతారో తెలియదన్నారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు అండగా ఉంటామని చెప్పిన వ్యక్తి.... ఇపుడు పార్లమెంటులో టీడీపీ ఎంపీలతో వక్ఫ్ సవరణ బిల్లలుకు అనుకూలంగా ఓటు వేయించడం నమ్మించి మోసం చేయడమేనన్నారు. వక్ఫ్ సవరణ బిల్లలుకు మద్దతు తెలిపిన జనసేన, టీడీపీ రెండూ ముస్లిం వ్యతిరేక పార్టీలేనన్నారు. ముస్లింలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఓటేసిందని మగ్బూల్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు అండగా నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి నిలబడ్డారన్నరు. ఇప్పటికై నా కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్, నూరుల్లా, సాధిక్, పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణంలోని ముస్లింలు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
గోరంట్ల: మండలంలోని కాలేకుంటపల్లికి చెందిన హరీష్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. హరీష్‌కు హిందూపురానికి చెందిన గాయత్రితో వివాహమైంది. కొంత కాలంగా హిందూపురంలో నివాసముంటూ మగ్గం పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉగాది పండుగకని సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైనా నేటికీ సంతానం కలగకలేదని, ఇక తనకు పిల్లలు పుట్టరనే మనో వేదన లోనైన హరీష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.