
గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు!
● వినియోగదారుడి ఫిర్యాదుతో
సిలిండర్ మార్చి ఇస్తామన్న ఏజెన్సీ
రొద్దం: వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్‌లో మామూలుగా గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ ఓ వినియోగదారుడికి ఇచ్చిన ఎల్పీజీ సిలిండర్‌లో మొత్తం నీళ్లు నిండిపోయి ఉన్నాయి. దీంతో వినియోగదారులు ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళికే.. రొద్దంకు చెందిన గాజుల వన్నూరుస్వామి నూతన గృహ ప్రవేశం ఉండడంతో శుక్రవారం వంట చేయడానికి స్థానిక ఓ గ్యాస్ ఏజన్సీ నుంచి సిలిండర్ తెచ్చుకున్నాడు. వంట మనిషి సిలిండర్‌ను గ్యాస్ పొయ్యికి అనుసంధానించినా స్టౌవ్‌కు గ్యాస్ సరఫరా కాలేదు. ఎంత ప్రయత్నించినా... పొయ్యి వెలగకపోవడంతో అసలు సిలిండర్‌లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానం వచ్చింది. దీంతో గ్యాస్ సిలిండర్‌ను తలకిందులు చేసి గ్యాస్ నాబ్‌ను నొక్కగా నీళ్లు వచ్చాయి. దీంతో వన్నూరు స్వామి విషయాన్ని గ్యాస్ ఏజెన్సీ వారికి తెలిపాడు. అయితే ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన సిలిండర్‌నే తాము డెలివరీ చేశామని, తమ తప్పులేదన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే సిలిండర్ తీసుకువస్తే మార్చి మరో సిలిండర్ ఇస్తామన్నారు.
జిల్లాకు వర్ష సూచన
బుక్కరాయసముద్రం: రానున్న మూడు రోజులు అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల తోపాటు కర్నూలు, నంద్యాల, జిల్లాల్లో రానున్న 3 రోజులూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 37.5 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్నారు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 25.0 నుంచి 26.6 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.