
కేఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా
అమరాపురం: మండలంలోని కె.శివరం గ్రామ చెరువు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కేఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు... కర్ణాటకలోని శిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పావగడ తాలూకా సాసలకుంట గ్రామం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు బెంగళూరుకు బయలు దేరింది. అమరాపురం మండలంలోని చిట్నడకు క్రాస్, ఆలదపల్లి, కె.గొల్లహట్టి మీదుగా 4.40 నిమిషాలకు కె.శివరం గ్రామానికి వెళుతుండగా.. చెరువు సమీపంలో రోడ్డుపై ఉన్న మట్టి రాత్రి కురిసిన వర్షానికి బురదగా మారడంతో బస్సు ఓ వైపుగా వాలడం మొదలైంది. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు నెమ్మదిగా రోడ్డు పక్కన బోల్తాపడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన లక్ష్మక్క, కెంచప్ప, శిల్ప, గాయత్రిను 108 వాహనం ద్వారా మడకశిరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఇషాక్‌బాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులు పావగడ తాలూకా ఎస్‌ఆర్‌పాళ్యం, కదిరేపల్లి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పందుల అపహరణ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
బెళుగుప్ప: గ్రామాల్లో రెక్కీ నిర్వహించి పందులను అపహరించుకెళుతున్న దొంగల ముఠా సభ్యుల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ శివ తెలిపిన మేరకు... ఈ ఏడాది జనవరి 5న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పందులను అపహరించుకుని వెళ్తున్నారంటూ బెళుగుప్పకు చెందిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో కొన్ని రోజుల క్రితం ఎరికల నాగరాజు, ఎరికల ముత్యాలప్పను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, అనంతపురానికి చెందిన సాకే ఆదినారాయణ అలియాస్ గుడ్డి ఆదినారాయణను శుక్రవారం కాలువపల్లి సమీపంలోని మానిరేవు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.40 వేలు నగదు స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.