
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ధర్మవరం: వేసవి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మవరం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ఎంతమేర నిధులు అవసరమో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నియోజకవర్గంలో 85 చెరువుల అభివృద్ధికి 96 పనులు ఆమోదించి రూ.179.9 లక్షలు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అలాగే త్రిబుల్ ఆర్ ద్వారా 21 చెరువుల అభివృద్ధికి రూ.795 లక్షలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, పీఏబీఆర్ కాలువల ద్వారా 14 చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముదిగుబ్బ మండలంలోని యోగివేమన రిజర్వాయర్ ప్రాజెక్టును రూ.60 లక్షలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గంలో తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం అర్బన్‌లో తీవ్ర నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మవరం మున్సిపాలిటీలోని శ్మశాన వాటికను హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న ఐదేళ్లలో అర్హులైన వారందరికి ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో 15,830 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపామని, అర్బన్ ప్రాంతాల్లో 13 వేల ఇళ్ల నిర్మాణ పనులు దశల వారీగా జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, మైనర్ ఇరిగేషన్ అధికారి విశ్వనాథ్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి మల్లికార్జునప్ప, హౌసింగ్ అధికారి శంకరయ్య, ఉద్యనశాఖ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ధర్మవరంలో శ్మశాన వాటిక
అభివృద్ధికి ప్రణాళికలు
వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి
సత్యకుమార్