ధర్మవరం అర్బన్: స్థానిక సత్యసాయినగర్‌కు చెందిన శంకర్ గోవిందు (70) ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం సిద్దయ్యగుట్టలో ఉన్న తన తల్లిని పలకరించి, రాత్రి సమయంలో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పట్టాలపై వస్తున్న రైలును గమనించకుండా రైల్వే గేటు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య చౌడమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న హిందూపురం జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ ఎర్రిస్వామి బుదవారం ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
వ్యక్తి దుర్మరణం
అగళి: ద్విచక్ర వాహన చోదకులు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం వడ్రుపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయులు (42) శిర నుంచి స్వగ్రామానికి వెళుతుండగా అగళి మండలం వడగుంటనహళ్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా దొక్కలపల్లి గ్రామానికి చెందిన రాకేష్, రంగనాథ్ వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది.
ఘటనలో రోడ్డు పక్కన కిందపడిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాకేష్, రంగనాథ్‌ను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కర్ణాటకలోని శిర ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.